హైదరాబాద్, మహా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు పూర్తిగా ఇస్తే బీజేపీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా పేరుతో దొంగ నాటకాలు చేస్తుందని, తెలంగాణలో చేసిన డ్రామాలతో రాజకీయ మైలేజ్ రావడం లేదని మరో రకమైన కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. సోమవారం తన నివాసంలో మాట్లాడుతూ.. ఈప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కామారెడ్డి డిక్లరేషన్లో వాగ్దానం చేసిన విధంగా బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా మోసం చేస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తుందని విరుచుక పడ్డారు. తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేసి కేంద్రంపై నెట్టి గత ప్రభుత్వం చేసిన విధంగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఎత్తులు వేస్తుందన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పడు ముస్లింలకు 10 శాతం ఇస్తామని చెప్పలేదని, అందుకే మద్దతు ఇచ్చామని, ముందు ఆమాట చెప్పి ఉంటే అప్పుడే బిల్లుకు దూరంగా ఉండేవారని తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్మే ప్రస్తకి ఉండదని వ్యాఖ్యానించారు.







