మందమర్రి, మహా : 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మందమర్రి ఏరియాలో 11 మంది ఉత్తమ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాలను నిర్వహించినట్లు స్థానిక జిఎం జి దేవేందర్ వెల్లడించారు. శుక్రవారం భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు జిఎం కార్యాలయం, సింగరేణి పాఠశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ భారతీయులుగా మనం ఎంతో గర్వ పడే విధంగా నేడు భారతదేశం ప్రపంచ దేశాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ కూడా ఇంత వరకు అనేక ఒడిదుడుకులు అధిగమించి ఇప్పుడు స్థిరత్వంతో ముందుకు అడుగు వేసిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గత 11 సంవత్సరాల కాలంలో దేశంలోని ఇతర బొగ్గు కంపెనీల కన్నా మిన్నగా బొగ్గు ఉత్పత్తి వృద్ధిని సాధిస్తూ మహారత్న కంపెనీలకు దీటు గా నిలుస్తుందని వెల్లడించారు.
మందమర్రి ఏరియా విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరం లో ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు మందమర్రి ఏరియా ఉత్పత్తి లక్ష్యం 34.60 లక్షల టన్నులు కాగా 27.11 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 78 శాతం ఉత్పత్తిని సాధించినట్లు చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సర ఆరంభంలో బొగ్గు మార్కెట్ మనకు అనుకూలముగా లేకపోయినప్పటికి అంతర్జాతీయ మార్కెట్ లో బొగ్గు ధర పెరగడం మనకు శుభ సూచకమని చెప్పారు. దీనితో బొగ్గుకు డిమాండ్ పెరగడం వల్ల మార్కెట్ లోని వినియోగదారుల దృష్టి సింగరేణి పై పడిందని అన్నారు.
అనంతరం ఏరియాలోని 11 మంది ఉత్తమ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సింగరేణి పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
మందమర్రి ఏరియాని లాభాల బాటలో నడపడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వతంత్ర పోరాటంలో అసులు బాసిన అమరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం విజయ ప్రసాద్, ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఎస్.కె గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, కే.కే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, సీ.ఎం.ఓ.ఏ.ఐ అధ్యక్షులు రమేష్ సివిల్ ఎస్సీ రాము, సీనియర్ పి.ఓ శంకర్
జి.ఎం కార్యాలయం ఉద్యోగులు, పాల్గొన్నారు.








