Mahaa Daily Exclusive

  రాజీవ్ స్వగృహ జలజ టౌన్ షిప్ ప్రాజెక్టు విక్రయం ఉద్యోగ, సహకార సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలకు చక్కటి అవకాశం అందుబాటులోని ధరల్లో మధ్యతరగతి ప్రజలకు ఇంటి వసతి..!

Share

ఖమ్మం, ఆగస్టు-24, మహా:

ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పోలేపల్లిలోని అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ ప్రాజెక్టును ఉన్నది ఉన్నట్లుగా ప్రాతిపదికన విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో జలజ టౌన్ షిప్ పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. నిర్మాణానికి అయిన ఖర్చుతోనే ఈ బహుళ అంతస్తుల సముదాయంతో ఉన్న ప్రాజెక్టు మొత్తాన్ని లాటరీ ద్వారా కేటాయించనున్నారు. వివిధ సహకార సంఘాలు, ఉద్యోగ సంఘాలు, బిల్డర్లు, డెవలపర్లు, జాయింట్ వెంచర్లు ఇలా గ్రూప్ హౌసింగ్ పథకాలపై ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఇందుకోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ జూలై 22 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబరు 8 వ తేదీన లాటరీ విధానంలో కేటాయించనున్నారు. దీంతో ఈ ప్రాజెక్టును గురించి తెలుసుకునేందుకు పలు సంఘాల ప్రతినిధులు ఇతరులు అనేక మంది వస్తున్నారు.
సుమారు 9.22 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టులో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించిన ఎనిమిది బ్లాకులు, తొమ్మిది ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్కో ఫ్లోర్ లో 8 ఫ్లాట్లతో ప్రాజెక్టు మొత్తం మీద 576 ఫ్లాట్లు ఉన్నాయి. వీటి పనులు వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా 60 అడుగుల అప్రోచ్ రోడ్డు మంజూరై పనులు కొనసాగతుండటమే కాకుండా, మున్నేరు నదికి సమీపంలో ఉండటం ప్రత్యక ఆకర్షణతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ప్రాజెక్టు ప్రత్యేకతలని అధికారులు వివరించారు. మంచి వసతులతో మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో, నిర్మాణానికి అయిన ఖర్చును మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటూ చదరపు అడుగు ధరను రూ.1150 మాత్రమే నిర్ణయించామని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరక్టర్ వి.పి. గౌతం తెలిపారు. ఖమ్మం నగరానికి పశ్చిమ వైపున ప్రాంతం అభివృద్ధి చెందుతున్నదని, అంతే కాకుండా కొత్తగా ఏదులాపురం మున్సిపాలిటీగా మారడంతో, పురోభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖమ్మం లోని వివిధ ఉద్యోగ సంఘాలు, సహకార సంఘాలు, ఇతరత్రా స్వచ్ఛంధ సంస్థలు ప్రభుత్వం నామమాత్రపు ధరతోనే అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ టౌన్ షిప్ లో మౌళిక వసతుల కల్పన కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వీటిపై ఆసక్తి కనపరుస్తూ ప్రాజెక్టు ప్రాంగణంలోనే సమావేశం కూడా నిర్వహించుకున్నారని తెలిపారు. ఇక్కడి భూములు, నిర్మించిన భవనాలపై ఎటువంటి అపోహలు వద్దని మేనేజింగ్ డైరక్టర్ వి.పి. గౌతం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకంగా లాటరీ ద్వారానే కేటాయింపులు చేస్తామన్నారు.

Latest