కుమురం భీం ఆసిఫాబాద్ మహా : కాగజ్‌నగర్ మండలంలోని కోయవాగు గ్రామపంచాయతీ వార్డ్ నెంబర్–2 ప్రజలు గత నాలుగు నెలలుగా తాగునీటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఏకైక హ్యాండ్ పంప్ దెబ్బతిన్నప్పటికీ ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో మహిళలు మైళ్ల దూరం నడిచి దూర ప్రాంతాలనుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. గ్రామంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ ఉన్నప్పటికీ నీరు సక్రమంగా రావడంలేదు. గత కాంట్రాక్టర్ ఒక అడుగు కూడా తవ్వకుండానే పైప్ లైన్ వేసినందున నీరు సరైన ఒత్తిడితో రావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పేరుకే మిషన్ భగీరథ, కానీ నీరు మాత్రం రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హ్యాండ్ పంప్ మరమ్మతుల విషయంలో పంచాయతీ కార్యదర్శి, స్థానిక అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ప్రజల నిరాశకు దారితీసింది. ఇకనైనా అధికారులు తక్షణమే సమస్య పరిష్కరించి గ్రామానికి తాగునీటిని అందించాలని వారు కోరుతున్నారు. తమ నీటి సమస్యలు పరిష్కరించకపోతే వార్డ్ నెంబర్–2 మహిళలంతా ఏకమై నిరసనకు దిగేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.తాగునీటి సమస్యతో పాటు పారిశుద్ధ్య పరిరక్షణలోనూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడం, చెత్త సకాలంలో తొలగించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాగునీరు, పారిశుద్ధ్యం తమ ప్రాథమిక హక్కులని వాటిని పరిష్కరించకపోతే మౌనం వహించమని వార్డ్ నెంబర్–2 ప్రజలు హెచ్చరిస్తున్నారు.






