హన్మకొండ మహా;
హన్మకొండలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో వినాయక చవితి సందర్భంగా బుధవారం భక్తి శ్రద్ధలతో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణం మొత్తం “గణపతి బప్పా మోరియా” నినాదాలతో మార్మోగింది.
అనంతరం మీడియాతో ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ప్రగతికి, లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఆ గణపతి అనుగ్రహించాలని కోరుకున్నట్లు తెలిపారు. చారిత్రక వేయి స్తంభాల ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. త్వరలోనే కేంద్ర మంత్రిని కలిసి నిధుల మంజూరుకు విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల సమన్వయంతో వరంగల్ జిల్లాలోని ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు, రహదారులు, విద్యా వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. అనంతరం నిర్వహించిన గణపతి పల్లకి సేవలో ఎంపీ డాక్టర్ కావ్య పాల్గొని స్వయంగా పల్లకి మోసారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.






