ఖమ్మం, మహా.
భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం మైలు తండా గ్రామంలో ఆదివారం ఘోర నిర్లక్ష్యంతో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని కొందరు కుటుంబాలు కలుపు మందు కలిసిన నీటిని పొరపాటున తాగడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో గ్రామం మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళితే .. గ్రామంలోని 15 మంది కూలీలు ఒకే సమయానికి నీరు తాగిన తర్వాత తీవ్రమైన వాంతులు, తలనొప్పి, మలబద్ధకం వంటి లక్షణాలతో ఒక్కొక్కరుగా కుప్పకూలారు. వారిని వెంటనే స్థానికులు అప్రమత్తమై సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించి ప్రస్తుతం బాధితులు ప్రమాదం నుంచి బయటపడ్డారని సమాచారం.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కూలీలు ఉన్న బండెలో కలుపు మందు కలిపిన నీటిని యజమానులు బయట ఉంచగా, దానిని తాగునీరు అనుకుని కూలీలు తాగడం వల్లే ఈ ఘటన జరిగిందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నిర్లక్ష్యం కారణంగా గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు.
సమాచారం తెలుసుకున్న వెంటనే వైద్యసిబ్బంది పెద్దఎత్తున గ్రామానికి చేరుకుని మరిన్ని కుటుంబాలు ప్రభావితం కాలేదా అని పరిశీలించారు. స్థానిక అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
గ్రామానికి చేరుకున్న అధికారులు కలుపు మందు నీటిలో కలిసిన కారణాలను దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైద్యులు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తూ, మిగతా గ్రామస్తులకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






