ఖమ్మం, మహా.
ఖమ్మం జిల్లాలోని ఐడీఓసీ కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఫోరం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. శ్రీనివాసరెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఉద్యోగ ప్రస్థానం
పేద రైతు కుటుంబంలో జన్మించిన కస్తాల సత్యనారాయణ, 1991 సెప్టెంబర్ 7న వాజేడు గ్రామంలో గ్రూప్-2 వార్డెన్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. క్రమశిక్షణ, నిబద్ధతలతో విధులు నిర్వర్తిస్తూ పలు పదోన్నతులు పొంది డిప్యూటీ డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. ప్రజలతో మమేకమై పనిచేస్తూ, తోటి ఉద్యోగుల అభిమానాన్ని చూరగొని, సాంఘిక సంక్షేమ శాఖను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. తన సేవల ద్వారా ఉత్తమ అధికారిగా జిల్లా అధికారుల మన్ననలు అందుకున్నారు.
* అతిథుల ప్రశంసలు.
ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి సత్యనారాయణ కృషి చేశారని, సంఘాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారని ప్రశంసించారు. అలాగే, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన వ్యవసాయం, కుటుంబ బంధాలకు ఎంతో విలువ ఇచ్చేవారని పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జిల్లా అధికారిగా సత్యనారాయణ అందించిన విశేష సేవలను కొనియాడారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర గొప్పదని, భవిష్యత్తులో కూడా ఇదే సేవా గుణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
సత్యనారాయణ కృతజ్ఞతలు
కార్యక్రమంలో కస్తాల సత్యనారాయణ మాట్లాడుతూ, తన ఉద్యోగ జీవితంలో సహకరించిన జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, షెడ్యూల్డ్ క్యాస్ట్ కార్యాలయ సిబ్బంది, వసతి గృహ సంక్షేమ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తన ఉద్యోగ ప్రస్థానంలో తోడుగా ఉన్న తన కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదని, తన సతీమణి వసంత, కుమారులు, కోడళ్లు, సోదరులు, అలాగే బావ కొండబాల కోటేశ్వరరావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీజీవో, టీఎన్జీవో, టీఈజేఏసీ, హాస్టల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, గెజిటెడ్, నాన్-గెజిటెడ్ అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






