ఖమ్మం, మహా.
**పిల్లల భవిష్యత్తు బలపడాలంటే, చదువు మాత్రమే కాదు ఆరోగ్యకరమైన ఆహారం కూడా అందాలి. ఈ భావనతో తెలంగాణ ప్రభుత్వం రాగిజావ పంపిణీ పథకాన్ని ముందుకు తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది విద్యార్థులకు అందించే ఈ పథకం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 80 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రాథమిక పాఠశాలలో(1–5 తరగతులు) 43,024 మంది, ఉప ప్రాథమిక పాఠశాలలో (6–8 తరగతులు)20,809 మంది, ఉన్నత పాఠశాలల్లో (9–10 తరగతులు) 16,143 మంది విద్యార్థులు చొప్పున
79,976 మంది విద్యార్థులు మెనూ అందుకోనున్నారు.
సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ కార్యక్రమం, విద్యార్థులలో పోషకాహార లోపాన్ని తగ్గించడం, ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం, విద్యపై ఏకాగ్రత పెంపొందించడం వంటి ప్రధాన లక్ష్యాలను సాధించబోతోంది**
ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులకు రాగిజావ పథకం కొత్త ఊపిరి నింపనుంది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి రాగిజావ పంపిణీకి ఆదేశాలు వెలువడగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 80 వేలమంది మంది విద్యార్థులు దీని లబ్ధిదారులుగా నిలుస్తారు. విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభమైనప్పటికీ ఆర్థిక శాఖ ఆమోదం ఆలస్యం కావడంతో ఈ పథకం రెండు నెలలకుపైగా నిలిచిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితోనే ఆమోదం లభించగా, ఇప్పుడు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పథకం అమలుకు సంవత్సరానికి సుమారు రూ.35 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అందులో 60 శాతం వ్యయాన్ని శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ భరిస్తుండగా, మిగతా భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ట్రస్ట్ ద్వారా అవసరమైన రాగిపౌడర్, బెల్లం పౌడర్ పాఠశాలలకు చేరవేయబడుతుంది. ప్రతి గ్లాస్ జావ వండినందుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రోజుకు 25 పైసల చెల్లింపు కూడా ఖరారైంది.
ఇప్పటికే మధ్యాహ్న భోజనం కింద రాష్ట్రవ్యాప్తంగా 25 వేల పాఠశాలల్లో పీఎం పోషణ్ పథకం అమలవుతోంది. వారంలో మూడు రోజులు కోడిగుడ్డు, మూడు రోజులు రాగిజావ అందించడం ద్వారా విద్యార్థులకు సమతుల ఆహారం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాఠశాలల్లో ఈ చర్య మరింత ముఖ్యమైంది, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల పిల్లలలో పోషకాహార లోపాలు ఎక్కువగా ఉన్నాయనే పరిశోధనలు సూచిస్తున్నాయి.
రెండున్నర నెలల ఆలస్యంతో విద్యార్థులు ఈ పథకం ప్రయోజనం కోల్పోయినప్పటికీ, ఇప్పుడు ప్రారంభం కావడం పాఠశాలల్లో ఆనందం నింపింది. భవిష్యత్తులో నిధుల విడుదలలో జాప్యం జరగకూడదని, పథకాన్ని నిరంతరాయంగా అమలు చేయాలని తల్లిదండ్రులు, సంఘాలు కోరుతున్నారు.






