జూలూరుపాడు, ఆగస్టు 31, (మహా): మండల పరిధిలోని పడమట నర్సాపురంలో ఎలాంటి లేకుండా అక్రమార్కులు మట్టితోలకం యదేచ్చగా సాగిస్తున్నారు. గ్రామంలో మంజూరీ అయిన ఇందిరమ్మ ఇండ్లకు మట్టి తోలుకొనుటకు పర్మిషన్ తీసుకొచ్చామనే సాకుతో ఇందిరమ్మ లబ్ధిదారులను పక్కనపెట్టి గ్రామంలో మట్టి వ్యాపారం సాగిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా సుమారు 15 ట్రాక్టర్లు, ఒక జెసిబి తో ప్రభుత్వ రెవిన్యూ పరిధిలోని గుట్ట నుండి ఆదివారం మధ్యాహ్నం తోలకాలు ప్రారంభించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ అక్రమార్కులు ప్రభుత్వ సెలవు దినాలనే వీరి పని దినాలుగా మలుసుకున్నారు. మట్టి అవసరాలు ఉన్న గ్రామస్తులను ఆసరాగా చేసుకొని ఒక్కో ట్రక్కు ఐదు వందల నుండి ఆరు వందల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు ముందస్తుగా ఒక చోటికి డంపు చేసుకొని అవసరాలకు తగినట్లుగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడి కనుసన్న లోనే సాగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. బాహాటంగా ఇంత జరుగుతున్న సంబంధిత అధికార మండల యంత్రాంగం పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని గ్రామంలో ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. గత మూడు రోజుల క్రితమే తహసిల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన ట్రాక్టర్స్, జెసిబి యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి, అనుమతులు లేకుండా అక్రమ తోలకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక తహసిల్దార్, ఎస్సై హెచ్చరించిన రోజుల వ్యవధిలోనే పట్టపగలే అక్రమానికి తెరలేపి అక్రమార్కులు అధికారులకు సవాళ్లు విసురుతున్నారు. ఇకనైనా అక్రమ తోలకాలను అరికట్టి, ప్రభుత్వ ఆస్తులను, పర్యావరణాన్ని కాపాడాలని సంబంధిత మండల అధికారులను ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయాన్ని శరవాణిలో స్థానిక తహసీల్దార్ టీ శ్రీనివాస్, ఎస్సై బి రవి కి తెలియజేయగా, విషయం తమ దృష్టికి రాలేదని, వెంటనే సిబ్బందిని పంపించి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






