Mahaa Daily Exclusive

  స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ..! హైకోర్టు గడువు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్. ముందస్తు పంచాయతీనా జెడ్పీటీసీనా సందేహం…!

Share

ఖమ్మం, మహా.

*తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్నాయి. పాలకవర్గాల గడువు పూర్తయి ఏడాది దాటినా ఇప్పటివరకు గ్రామాల్లో ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించబడలేదు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలు, మండలాలు, జెడ్పీ స్థాయిల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. నిధుల కొరత, పాలనలో చిత్తశుద్ధి లోపం, అభివృద్ధి పనుల నిలకడ గ్రామీణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. ఇక హైకోర్టు ఇచ్చిన తుది గడువు, రాష్ట్ర కేబినెట్ ఇచ్చిన గ్రీన్‌సిగ్నల్, ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల ..ఈ మూడు పరిణామాలు కలిపి ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో 571 గ్రామపంచాయతీలు, 5,214 వార్డులు, 8 లక్షల 2 వేల 690 ఓటర్లు సిద్ధంగా ఉండటం, రాష్ట్ర ఎన్నికల సంఘం 10 వేల మంది సిబ్బందిని ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశించడం ఎన్నికలు త్వరలో జరగనున్న సంకేతాలుగా మారాయి*

ఖమ్మం జిల్లా ఎన్నికల మ్యాప్ ఇప్పటికే స్పష్టమైంది. మొత్తం 571 గ్రామపంచాయతీలు, 5,214 వార్డులు, 8,02,690 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 5,214 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. అంతేకాకుండా సిబ్బంది అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 వేల మంది సిబ్బంది నియామకంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఖమ్మం జిల్లాలో ఎన్నికల రంగం వేడెక్కుతోంది. అభ్యంతరాల పరిశీలన అనంతరం వచ్చే నెల 2న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది.

* రాష్ట్రస్థాయిలో పరిస్థితి.

రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల పైగా గ్రామపంచాయతీలు, వేలాది మండలాలు, జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల గడువు ముగిసినా ప్రత్యేకాధికారుల పాలన సాగుతూనే ఉంది. అభివృద్ధి పనులు ఆగిపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత కొన్నేళ్లుగా “నేడో రేపో ఎన్నికలు వస్తాయి” అనే ఊహాగానాలు వినిపించినా స్పష్టత రాలేదు. కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసింది. తాజాగా హైకోర్టు స్పష్టమైన గడువు విధించడం, కేబినెట్ ఎన్నికలకు ఆమోదం తెలపడం ఎన్నికలు తప్పనిసరిగా జరగనున్న సంకేతాలు.

* హైకోర్టు తీర్పు ప్రభావం.

సెప్టెంబర్ 30లోపు పాలకవర్గాలు ఏర్పాటవ్వాలని హైకోర్టు ఆదేశించడం ఎన్నికల సంఘంపై ఒత్తిడిని పెంచింది. ఈ గడువులోపే నోటిఫికేషన్ రావాల్సిందే. ఈసారి ఎన్నికల క్రమమే పెద్ద చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికలే ముందా? లేక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలే ముందా? అన్న సందేహం కొనసాగుతోంది.

* రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ.

రాష్ట్ర రాజకీయ వర్గాలు ఇప్పటికే వ్యూహరచన మొదలుపెట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరిపింది. ఆశావహులు తమ బలాన్ని అంచనా వేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎడమపక్షాలు కూడా శక్తిసాధనకు సిద్ధమవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో గతంలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆధిపత్యం చూపగా, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.

* ప్రజల్లో ఉత్సుకత.

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల జోరు మొదలైంది. పంచాయతీల్లో అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో ప్రజలు కొత్త నాయకత్వం రావాలని కోరుతున్నారు. మాజీ ప్రజాప్రతినిధులు మళ్లీ రంగప్రవేశానికి సిద్ధమవుతుండగా, కొత్త నాయకులు కూడా పోటీకి రంగంలోకి దిగుతున్నారు.

ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి వ్యాపించిన స్థానిక ఎన్నికల ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతోంది. ఓటర్ల జాబితా తుది రూపం దాల్చిన వెంటనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించనుంది. మొదట ఏ ఎన్నికలు జరుగుతాయన్నది ఇంకా అనుమానంగానే ఉన్నా, ఎన్నికలు ఇక తప్పనిసరిగా జరగనున్నాయి. దీంతో ఖమ్మం జిల్లా మాత్రమే కాకుండా మొత్తం తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా కసరత్తుల దిశగా దూసుకుపోతోంది.

Latest