మంచిర్యాల, మహా : సింగరేణి కాలరీస్ కంపెనీ సిఎండి ఎన్ బలరామ్ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. పర్యావరణ హిత చర్యలు, సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో 4 బొగ్గు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ను సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకుంది. ఈ సందర్భంగా గురువారం ముంబయిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సింగరేణి సంస్థ ఛైర్మన్ కు అవార్డులను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను అందుకున్న గనులలో రామగుండం-3 ఏరియాకి చెందిన ఆర్.జి.ఓ.సి-1 ఎక్స్ టెన్షన్, ఇల్లందు ఏరియాకి చెందిన జే.కే.-5 ఓసి, భూగర్భగనుల్లో శ్రీరాంపూర్ ఏరియాకి చెందిన ఆర్కే-6 గని , ఆర్కే న్యూటెక్ గనులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతీ ఏడాది దేశంలో అత్యుత్తమ గనులకు స్టార్ రేటింగ్ ను ఇస్తూ అత్యుత్తమ స్టార్ రేటు సాధించిన గనుల యాజమాన్యాలను అభినందిస్తూ అవార్డులను అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియను స్టార్ రేటింగ్ అంటారన్నారు.ఇలా స్టార్ రేటింగ్ ఇవ్వడం కోసం బొగ్గు గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, అక్కడ గల సౌకర్యాలు, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాలను పరిగణనలోనికి తీసుకుని మార్కులను కేటాయించడం జరుగుతుంది పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పి ఉన్న గనులలో పై 84 అంశాలను కేంద్ర బొగ్గు శాఖ నుండి వచ్చిన పరీశీలక బృందం వారు ప్రత్యక్షంగా పరిశీలించి మూల్యాంకనం జరుపుతారనీ అన్నారు. ప్రాథమిక మూల్యాంకనం తర్వాత వీటి నుండి అత్యుత్తమ గనులను ఎంపిక చేస్తారని తెలిపారు. ఇలా ఎంపిక చేసిన వాటిలో ఇంకా అత్యుత్తమమైన వాటిని మరో కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. మొత్తం 100 మార్కుల్లో 91 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారని చెప్పారు. ఈ విధంగా సింగరేణి సంస్థలో ఈసారి నాలుగు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడం పట్ల ఆయన అభినందించారు. ఈ గనుల నిర్వహణ, పర్యావరణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉత్పత్తి సాంకేతికత వంటి అంశాలలో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందు వల్లే ఈ అవార్డులకు ఎంపికైనట్లు వివరించారు. అనంతరం సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎండీ బలరామ్ మాట్లాడుతూ సింగరేణి కంపెనీ ఒకవైపు ఉత్పత్తి ఉత్పాదకత మరోవైపు సంక్షేమం వైపు దృష్టిసారిస్తుందని వెల్లడించారు. సింగరేణికి నాలుగు అవార్డులు దక్కడం పట్ల ఆ గని అధికారులకు, కార్మికులకు
అభినందనలు తెలిపారు. ఈ నాలుగు గనుడే కాకుండా మరో 14 గనులు 100 కు 80 నుండి 90 మార్కులు సాధించి 4 స్టార్ రేటింగు ను అందుకోవడంతో పాటు 20 గనులకు 3 స్టార్ రేటింగ్ రావడం విశేషమని వెల్లడించారు. గతంలో కొన్ని గనులకు 2 స్టార్ రేటింగ్ లు రావడమే గొప్పగా ఉండేదని అన్నారు. ఈ సారి అన్ని గనులు తమ పనితీరును మెరుగుపరచుకుని 3 స్టార్ రేటింగ్ సాధించడం సింగరేణి సంస్థ ఖ్యాతి భారతదేశ నలుమూలల వ్యాపించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.






