తాండూర్ /మంచిర్యాల, మహా : ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు.
గురువారం తాండూర్ మండలం తంగళ్ళపల్లి గ్రామంలోని గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమ వసతి గృహ ఏర్పాటు కొరకు మండల తహసిల్దార్ జ్యోత్స్న తో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సౌకర్యార్థం సకల సౌకర్యాలు, అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు, నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు చేపడుతుందని వివరించారు.
అనంతరం తాండూర్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జనానికి పెద్ద చెరువు ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డి.సి.పి. ఎ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు. వినాయక శోభాయాత్ర అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిమజ్జనం ప్రాంతంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. తాండూర్ మండల కేంద్రంలోని ఐ.బి. ప్రాంతంలో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ మండలిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, నిమజ్జన ప్రాంతంలో లైట్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మండలంలో ఏర్పాటు చేసిన వినాయక మండళ్లు రిజిస్ట్రేషన్ అయిన ప్రకారం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులకు తావు లేకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






