వరంగల్ మహా;
ప్రతీ వర్షాకాలంలో
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ప్రజలకు,
వాహనదారులకు ఇబ్బందులు
ప్రమాదాలు జరుగుతున్నా అర్ &బి.. జిడబ్ల్యుఎంసి అధికారులు పట్టించుకోవడం లేదని నగర ప్రజలు వాపోతున్నారు.
కాగా కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా ఉంది, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు. నగరంలోని గుంతల రోడ్ల ను పూడ్చడానికి వచ్చిన కార్పొరేషన్ అధికారుల తో కలిసి సిబ్బంది సిమెంట్ కంకర పోసి కొత్త సమస్యలను సృష్టించారు. నిత్యం వాహన దారులతో రద్దీగా ఉండే పోచమ్మ మైదాన్ జంక్షన్ నుండి దేశాయి పేట మీదుగా పైడిపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పై మంచినీటి మెయిన్ పైప్ లైన్ లీకేజీల కారణంగా పదేపదే తవ్వడంతో పెద్ద పెద్ద గుంతలతో రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. దీంతో పాటు కాశిబుగ్గ ప్రధాన రహదారి అలాగే అండర్ బ్రిడ్జి మీదుగా ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి లో ప్రతి సంవత్సరం వర్షాకాలం గుంతలమయం దర్శనమిస్తుంది. ప్రతిరోజు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రయాణిస్తున్నా పట్టించుకునే పరిస్థితి మాత్రం లేదు. ప్రజల ఫిర్యాదుల మేరకు కార్పొరేషన్ అధికారులు తూతూ మంత్రంగా గుంతలు పూడ్చి చేతులు దులిపేసు కుంటున్నారు. గుంతలు పూడ్చిన ప్రభుత్వ అధికారులు మధ్యలోనే వదిలేసి కొత్త సమస్యను పెంచుతున్నారని అధికారులు ఏ పని చేసినా పనితీరు అంతంత మాత్రంగా ఉంటుందని మరోసారి నిరూపించుకున్నారు. గుంతల సమస్యను చూడడం ఇష్టం లేని స్థానికులు వాటిని పూడ్చేందుకు స్వతహాగా తట్టా పారాకు పని చెప్పే పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది.






