మణుగూరు మహా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని బుగ్గ, ఖమ్మంతోగు, బుడుగుల గిరిజన గ్రామాలు రవాణా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సుమారు రెండు వందలకుపైగా వలస ఆదివాసి కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామాలకు వర్షాకాలం మొదలయ్యిందంటే రాకపోకలు కష్టతరమవుతున్నాయి. బురదమయమైన రహదారుల కారణంగా విద్య, వైద్యం, నిత్యావసరాల సరఫరా, అటవీ ఉత్పత్తుల విక్రయాలు సైతం సంక్లిష్టమవుతున్నాయని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– ఇబ్బంది పడుతున్న ఖమ్మం తోగు, బుగ్గ గ్రామాల గిరిజనులు..
మణుగూరు పట్టణానికిక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుగ్గ గ్రామం, అక్కడి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం తోగు, అలాగే మరికొద్దిదూరంలో ఉన్న బుడుగుల గ్రామాలకు రహదారి అద్వాన్నంగా ఉంది. మామూలు సమయాల్లోనే అడవి మార్గాన అంతంతమాత్రంగా రాకపోకలు సాగించే గిరిజనులు వర్షాకాలంలో వారి అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఆ గ్రామాల్లో నివసిస్తున్న వలస ఆదివాసీల పరిస్థితి దారుణంగా ఉందని, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం లేదా మరే ఇతర అవసరాలకు మణుగూరుకు రావాలన్న వాగులు, వంకలు, చిత్తడి రహదారులపై రావడం కష్టతరంగా ఉంటుందని ఆయా గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు సింగరేణి యాజమాన్యం తాత్కాలిక మరమ్మతులు చేసినా వరదలతో రహదారులు మళ్లీ యథాతథ స్థితికి చేరుతున్నాయన్నాని వాపోతున్నారు. ఈ రహదారులపై ద్విచక్ర వాహనాలతో ప్రయాణం సర్కస్ ఫీట్లను తలపిస్తోందని, అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీలు, రోగులను తరలించడానికి అంబులెన్స్ సైతం వెళ్లలేని పరిస్థితి ఉందని కన్నీటి పర్యంతమవుతున్నారు..
– సమస్యలు పరిష్కరించాలని ఇఫ్టు డిమాండ్..
మణుగూరు మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామాల ప్రజల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని
ఐఎఫ్‌టీయూ నాయకులు యస్.డి నాజర్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మహా న్యూస్ తో మాట్లాడారు.
ఈ ఈ గ్రామాలకు చెందిన సమస్యలపై ఎన్నిసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆయా గ్రామాల గ్రామస్తులు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వాలు స్పందించలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ తక్షణమే జోక్యం చేసుకుని వర్షాకాలం ముగిసిన తరువాత బుగ్గ, ఖమ్మంతోగు, బుడుగుల గ్రామాలకు రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, అప్పటివరకు కనీసం సింగరేణి యాజమాన్యం ద్వారా మరమ్మతులు జరగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, అంగోత్ మంగీలాల్, పెనుగొండ నాగార్జున, సంజీవ్, వెంకటేశ్వర్లు, జి. శ్రీనివాస్, సాధనపల్లి రవి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.






