జూలూరుపాడు, సెప్టెంబర్ 07, (మహా): డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎంపిక చేసిన వినోబానగర్ ఫ్రీ ప్రైమరీ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్ కావాలనే బదిలీ చేశారని, వినోబానగర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మా గ్రామానికి మంజూరీ అయిన పాఠశాలను మా గ్రామంలోనే కొనసాగించాలని మండల విద్యాశాఖ అధికారిని వారు కోరుతున్నారు. గ్రామస్తులకు తెలియకుండా, పాఠశాల ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్ఎం ఎలాంటి తీర్మానం ఇవ్వకుండా పాఠశాలను ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పాఠశాల తరగతి గదుల మరమ్మత్తులు, టాయిలెట్స్ నిర్మాణం కొరకు ప్రభుత్వం సుమారు 3,70, 000 నిధులు కేటాయించిందని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో ఒక టీచర్ తో పాటు, ఒక ఆయాను నియామకం చేస్తారని అన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తమకు తెలియకుండా, తన కాంప్లెక్స్ పరిధిలోని కాకర్ల గ్రామానికి తరలించారని ఆరోపించారు. ఈ విషయంపై ఎంఈఓ ని పలుమార్లు అడిగిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యధావిధిగా మా గ్రామంలోనే పాఠశాలను ప్రారంభించాలని వారు కోరారు.
మండల విద్యాశాఖ అధికారి వివరణ: ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్ ను వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలను సందర్శించటం జరిగిందని, ప్రస్తుతం పాఠశాల పరిస్థితుల పై నివేదికను అధికారులకు పంపించడం జరిగిందని తెలిపారు. పాఠశాలకు కావలసిన వసతులు అక్కడ లేనందున పై అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలను కాకర్లకు బదిలీ చేయడం జరిగిందని అన్నారు. ఫ్రీ ప్రైమరీ పాఠశాలలో కేవలం నాలుగేళ్ల వయసుగల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహిస్తారని, కానీ ఆ గ్రామంలో కేవలం నలుగురు మాత్రమే విద్యార్థులు ఉన్నట్లు పాఠశాల ఉపాధ్యాయుడు నివేదించారని అన్నారు. ఇది కేవలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని పాఠశాలలను తీసుకుంటారని తెలిపారు. పాఠశాలను మార్చడంలో ఎలాంటి స్వార్థం లేదని, మండల విద్యాశాఖ అధికారిగా పై అధికారుల సూచనల మేరకే తాను విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.






