మంచిర్యాల, మహా : మంచిర్యాల, నస్పూర్ లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఫ్లెక్సీల లొల్లి, మంగళవారం రాత్రి ఇరుపక్షాలు సై అంటే సై సై తో నస్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే….బోనాల జాతర సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు నస్పూర్ లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ప్రతిపక్ష నేత, నస్పూర్ 17 వార్డ్ మాజీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఫ్లెక్సీని కొందరు కాంగ్రెస్ నాయకులు చింపేశారని ఆరోపిస్తూ కేసు పెట్టేందుకు భారత రాష్ట్ర సమితి నాయకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ ఆవరణకు చేరుకున్నారు. స్టేషన్ లో ఫిర్యాదు అందజేసి బయటికి వస్తున్న కాటం రాజు, బేర సత్యనారాయణపై దాడికి పాల్పడ్డారు. ఎలా గోల పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన బేర సత్యనారాయణ గట్టిగా అరవడంతో పోలీసులు వచ్చి అక్కడున్న నాయకులను వెళ్లగొట్టారు. ఈ సమాచారం అందుకున్న మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ హుటాహుటిన నస్పూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. గాయాల పాలైన బీఆర్ఎస్ నాయకులు కాటం రాజును, సత్యనారాయణను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదులను సేకరించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ఫ్లెక్సీల లొల్లే
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీల లొల్లిలే దర్శనమిస్తున్నాయి. వీరి లొల్లిలను కట్టడి చేయడం పోలీసులకు కత్తి మీద సాముల తయారయిందని చెప్పవచ్చు. ముఖ్య నాయకులను కార్యకర్తలను అదుపు చేయడంలో అటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇటు మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు విఫలమవుతున్నట్లు తెలుస్తోంది.
పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కొరకు కృషి చేయవలసిన ఎమ్మెల్యే కిందిస్థాయి నేతలు నేడు వాటిని మరిచి పలు రహదారుల ముఖ్య కుండలీలలో పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
అయ్యా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల్లారా మీతో తిరిగే వారి చరిత్ర, ఫ్లెక్సీలు పెట్టే వారి చరిత్ర గురించి, మీ భజన గ్యాంగ్ ల చరిత్రను తెలుసుకొని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలా కాని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వేటు పడక తప్పదని ప్రస్తుత ఎన్నికల పరిస్థితి గణంకాలు తెలుపుతున్నాయి జాగ్రత్త సుమా.
మాజీ ఎమ్మెల్యే పరమార్శ
కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు దాడిలో గాయపడ్డ వారిని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరమర్శించారు. ఘర్షణకు దారి తీసిన అంశాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి తగదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు అన్నారు.






