కాగజ్ నగర్ మహా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ టౌన్‌లో అక్రమంగా వినియోగిస్తున్న రాయితీ గ్యాస్ సిలిండర్లపై ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో పలువురు హోటళ్ల యజమానులు ప్రభుత్వ రాయితీ గ్యాస్‌ను కమర్షియల్ ఉపయోగానికి దుర్వినియోగం చేస్తున్నట్లు వెల్లడైంది.పట్టణంలోని కాకతీయ మెస్, అన్నపూర్ణ హోటల్, రుమన్ కళ్యాణి బిర్యానీ, ఆదిత్య పర్మిట్ రూమ్, శ్రీ హోటల్, పంకజ్ దాబా, సంగీత హోటల్, సలాసర్ స్వీట్ హౌస్ లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 17 రాయితీ గ్యాస్ సిలిండర్లను పట్టకున్నారు. ప్రభుత్వ సబ్సిడీపై అందుతున్న గ్యాస్‌ను కమర్షియల్ వినియోగానికి ఉపయోగించడం నిషిద్ధమని, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మధుకర్ హెచ్చరించారు.హోటళ్లు, రెస్టారెంట్లు తదితర వాణిజ్య విభాగాల్లో కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు మాత్రమే వాడాలని స్పష్టం చేశారు.






