Mahaa Daily Exclusive

  ఇలా చేశావేంటి మల్లన్న తీన్మార్ మల్లన్నపై బీసీయూఎఫ్ రామకృష్ణయ్య సీరియస్…!

Share

హైదరాబాద్, మహా
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీసీల నాయకుడిగా ప్రచారం చేసుకుంటున్నారని బీసీయూఎఫ్ జాతీయ అధ్యక్షుడు పాలురి రామకృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న అగ్రవర్ణాల్లో ఎవరిని వదలకుండా అందరి మోచేతి నీళ్లు తాగారని ఇప్పుడు గణాంకాలు చూపుతూ బీసీల నాయకుడిగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ గణాంకాలు ఎవరికి తెలియవు? జర్నలిస్టులందరికీ ఆ లెక్కలు తెలుసన్నారు. ఆయనంతట ఆయనే బీసీయూఎఫ్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న.. ఇప్పుడు ఆయనంతట ఆయనే వెళ్లి కొత్త పార్టీ పెట్టుకున్నారని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన రామకృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పదిహేను రోజుల క్రితం మా వద్ద నియామక పత్రం తీసుకుపోయి మాకే మూడు నామాలు పెట్టిన మీరు ఇతరులకు ఇంకెవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. మల్లన్న బీసీయూఎఫ్ పార్టీని ఆయనకు ఇవ్వాలని ఆయన్ను జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించాలని చాలా ప్రయత్నించినట్లు రామకృష్ణయ్య చెప్పారు. పార్టీ పేరులో బీసీ అని ఉండటంతో తనకు చాలా ఇష్టం అని పార్టీని తనకు ఇవ్వాలని కోరారని, ఈ విషయంలో మల్లన్న నా ఇంటికి కనీసం 7 సార్లు, సోమాజిగూడలోని కార్యాలయానికి రెండు సార్లు వచ్చారన్నారు. మా పార్టీని 2004 లో రిజిస్టర్ చేశామని అప్పటి నుంచి పార్టీని నడుపుతూ వస్తున్నామని మరి ఇప్పుడు పార్టీని మీకు అప్పగిస్తే మేమేం చేయాలని అడిగామని జాతీయ అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమిస్తూ పార్టీని అప్పగించే ప్రసక్తే లేదని చెప్పామన్నారు. దాంతో మీ పార్టీ వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిన మల్లన్న ఆ మరుసటి రోజు మళ్లీ నావద్దకు వచ్చి పార్టీలో చేరితే నాకు ఏ పదవి ఇస్తారని అడుగుతూ వచ్చారన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న మీకు చిన్న పదవి ఇస్తే బాగుండదని మా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు లేదని అందువల్ల మల్లన్న కోసం ప్రత్యేకంగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి పోస్టును క్రియేట్ చేసి ఈ ఏడాది ఆగస్టు 30న అపాయింట్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టుకోవడంతో ఆయనను పార్టీ పదవి నుంచి తొలగిస్తూ ఈసీకి లేఖ రాస్తామన్నారు.

Latest