Mahaa Daily Exclusive

  పార్టీ అంటే పాన్ డబ్బా కాదు.. బీసీల హక్కులు, రాజ్యాధికారం కోసమే ఇది: తీన్మార్ మల్లన్న

Share

హైదరాబాద్, మహా: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సెప్టెంబర్ 17, 2025న హైదరాబాద్‌లో కొత్త పార్టీని ప్రారంభించారు. ఆ పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ. ఈ పార్టీ ప్రధానంగా వెనుకబడిన తరగతులు(బీసీలు), పేద ప్రజల కోసం అని మల్లన్న ప్రకటించారు. ఆత్మగౌరవం, అధికారం, రాజకీయాల్లో న్యాయమైన వాటా నినాదంతో పార్టీని తీసుకొచ్చారు. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన అజెండాగా ఈ పార్టీని స్థాపిస్తున్నట్టుగా తీన్మార్ మల్లన్న ఇప్పటికే చెప్పుకొచ్చారు. పార్టీ జెండా ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉంటుంది. ఎరుపు అంటే పోరాటం, ఆకుపచ్చ అంటే రైతులు అనే అంశంతో పెట్టినట్టుగా అర్థమవుతోంది. జెండాపై ‘ఆత్మగౌరవం, అధికారం, వాటా’ అనే పదాలు ఉన్నాయి.

తలరాత మారే రోజుగా పార్టీని ప్రకటిస్తున్నాం..
సెప్టెంబర్ 17వ తేదీ బీసీల తలరాత మారే దినంగా తాను భావిస్తున్నానని తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందనే ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ‘తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి భీఫాంలు అడుక్కునే పరిస్థితి ఈ రోజు నుంచి ముగిసింది. సెప్టెంబర్ 17కు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. పెరియార్ జయంతి, విశ్వకర్మ జయంతి అయిన రోజున బీసీల తలరాత మారే రోజుగా పార్టీని ప్రకటిస్తున్నాం. బీసీలకు పార్టీ అవసరం అని మేధావులు, బీసీల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పార్టీ అంటే పాన్ డబ్బా కాదు.. బీసీల హక్కులు, రాజ్యాధికారం కోసం పార్టీ పెడుతున్నాను.’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. అవకాశాల కోసం బీసీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఆధారపడకూడదని తీన్మార్ మల్లన్న అన్నారు. గతంలో పక్కన పెట్టిన కులాలకు టీఆర్పీ సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది సర్కస్ కాదని, సీరియస్ పార్టీ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా విఫలమయ్యానని ఎవరైనా నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా ఉండాలని మల్లన్న కోరారు. టీఆర్పీ ప్రారంభోత్సవానికి అనేక మంది బీసీ నాయకులు, ప్రజలు హాజరయ్యారు

Latest