హైదరాబాద్, మహా: దేశాన్ని వికసిత్ భారత్‌గా ఆవిష్కరించేందుకు అందరం కలిసి పనిచేద్దామని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షకావత్ పిలుపునిచ్చారు. ఈరోజు భారతదేశంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ.. నిరంకుశ పాలనను తొలగించి హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం అయ్యిందని తెలిపారు. ప్రతి ఏటా సాంస్కృతిక శాఖ అధికారులు విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించారని చెప్పారు. దేశాన్ని ఏకం చేసేందుకు ఎంతో మంది బలిదానం చేశారని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణలో నిరంకుశ పాలన సాగిందన్నారు. నిజాం, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయించేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు. ఆపరేషన్ పోలో పేరుతో నిజాం రాజ్యాన్ని ఓడించి హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేశారని తెలిపారు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు యత్నించిన, రచయితల , కళాకారుల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.
ఇక్కడెందుకు నిర్వహించడం లేదు..
ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు పల్లెలపై పడి దోచుకున్నారని అన్నారు. గ్రామాలపై పడి హత్యలు, అత్యాచారాలు చేశారన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో ముక్తి దివస్ చేసుకుంటే.. ఇక్కడెందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. పేర్లు మార్చి కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి పార్టీలు వేడుకలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. మజ్లిస్‌కు భయపడి చరిత్రను కనుమరుగు చేస్తున్నారని ఆరోపించారు. నిజాం నిరంకుశ పాలన తలచుకుంటే ప్రజల రక్తం మరుగుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఉర్దూను ప్రజలపై రుద్దేందుకు నిజాం ప్రయత్నించారన్నారు. బలవంతపు మతమార్పిడులు చేశారని, మతం మారని వారికి ఎక్కువ పన్నులు వేసి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో రాష్ట్ర పాలకులు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటులో రాజ్‌నాథ్ సింగ్ ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు.






