లండన్: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నాం, గత 15నెలల్లో ఏపీకి 10లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అది విజనరీ లీడర్ చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 కు గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు లండన్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా ఏపీ ప్రభుత్వం – యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్ర యూరప్ బిజినెస్ హెడ్ హర్షుల్ అస్నానీ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి సాధించడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది లీడర్ షిప్ ట్రాక్ రికార్డ్. మాకు సుస్థిరమైన నాయకత్వం ఉంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆయన అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.






