Mahaa Daily Exclusive

  శిర్డీ సాయిబాబా సంస్థాన్​ పేరుతో నకిలీ వెబ్​సైట్ మోసపోయిన భక్తులు..!

Share

శిర్డీ, మహా

శిర్డీ అనేది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తుల ఆధ్యాత్మిక కేంద్రం. రోజూ వేలాది మంది భక్తులు సాయిబాబా దర్శనార్థం ఇక్కడకు వస్తుంటారు. భక్తుల సౌలభ్యం కోసం సాయిబాబా సంస్థానం భక్త నివాసం, విరాళాలు, దర్శన పాస్ వంటి సేవలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. అయితే, దీనినే అవకాశంగా తీసుకొని కొంత మంది మోసగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు. తాజాగా గుర్తు తెలియని ఓ వ్యక్తి సాయి సంస్థాన్ భక్తన్ నివాస్ పేరుతో నకిలీ వెబ్​సైట్​ను సృష్టించాడు. ఆ నకిలీ వెబ్​సైట్ ద్వారా​ ఓ ఫ్యామిలీ మోసం పోవడంతో ఈ విషయం వెలుగులో వచ్చింది. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన రాము జాదవ్ అనే వ్యక్తి తన మనవడి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి శిర్డీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం రాము కుమారుడు గూగుల్​లో శిర్డీ సాయిబాబా వెబ్​సైట్ కోసం సెర్చ్ చేశాడు. అతడికి సాయి సంస్థాన్ భక్తన్ నివాస్ అనే పేరుతో ఓ వెబ్​సైట్ కనిపించింది. అదే అధికారిక వెబ్​సైట్ అనుకుని గది బుకింగ్ చేశాడు. తర్వాత నగదు కోసం వాట్సాప్​లో ఓ స్కానర్​ను పంపించారు. దాని నుంచి రూ.2100 చెల్లించాడు. రశీదును భక్తనివాస కౌంటర్ వద్ద ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత రాము కుటుంబ శిర్డీకు వెళ్లారు. అక్కడ భక్తనివాసానికి చేరుకున్న తర్వాత తమ పేరుతో ఎలాంటి బుకింగ్​ కాలేదని చెప్పారు. దీంతో వాళ్లు మోసపోయినట్లు తెలుసుకున్నారు. సాయిబాబా సంస్థాన్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా భక్తులను మోసం చేస్తున్నవారిపై శిర్డీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది అని సంస్థాన సీఈఓ గోరక్ష గడీల్కర్ తెలిపారు. సాయిబాబా సంస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లు తయారు చేసి, రూమ్ బుకింగ్, విరాళాలు, దర్శన పాస్ పేర్లతో అనేక మంది భక్తులను మోసం చేసినట్లు ఇంతకు ముందు కూడా కేసులు నమోదయ్యాయి.

Latest