Mahaa Daily Exclusive

  సింగరేణి లాభాల వాటా ఎప్పుడు ఇస్తారు సారు…? పండగ మీద పండగలు రాబట్టే చేతిలో చిల్లి గవ్వలు లేకపాయే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సింగరేణి కార్మికులు ..!

Share

మంచిర్యాల, మహా : గత సంవత్సరం సింగరేణి లాభాలలో వాటా ఎప్పుడు ఇస్తారు సారు…? అని సింగరేణి కార్మికులు యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతి యేడు దసరా, దీపావళి పండుగల సమయంలో సింగరేణి లాభాల వాటాను కార్మికులకు పంచడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఇప్పటివరకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం లాభాల వాటను ప్రకటించకపోవడం పట్ల కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటియుసి) ప్రాతినిధ్య సంఘం (ఐ.ఎన్.టి.యు.సి), ఇతర 3 జాతీయ సంఘాలతో పాటు టీబీజీకేఎస్,ఐఎఫ్టియు సంఘాలు కార్మికులకు గత సంవత్సరం సింగరేణి లాభాల నుండి 35 శాతం వాటా కార్మికులకు పంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇటు సింగరేణి యాజమాన్యం అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పండుగలు ఎలా ఒడ్డెక్కుతాయోని కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు. కార్మికులకు నెలవారి జీతభత్యాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ అవి పిల్లల చదువుల వడ్డీ, అసలుకు, కొత్తగా వివాహమై ఇంటికి పండగ వేల వచ్చిన అల్లుడి లాంఛనాలకు, ఇన్కమ్ టాక్స్ రూపంలో నెలవారీగా 50 వేల రూపాయల పైచిలుకు జీవితంలో నుండి కోతపడుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో పండగ పూట కొత్త బట్టలు, కొత్తగా వివాహమైన గృహానికి వచ్చిన కూతురు, అల్లునికి లాంఛనాలు ఈతరాత్రలు ఎలా ఎల్లతీయాలని కార్మిక కుటుంబాలు కూమిలిపోతున్నాయి. సింగరేణి ఉత్పత్తి ఉత్పాదకత వార్షిక లక్ష్యాలను సాధించేందుకు కార్మికులు, యూనియన్ నాయకుల కృషి ఎంతగానో ఉంటుంది. లక్ష్యాలను అధిగమించేందుకు సింగరేణి యాజమాన్యం వివిధ ఏరియాల జిఎంలతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో సింగరేణి ఉత్పత్తి లక్ష్యాలపై ఉన్న శ్రద్ధ గత 2024-25 లాభాల వాటా కార్మికులకు పంచడంలో ఎందుకు లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా కార్మికుల లాభాల వాటా హక్కు కాకపోయినప్పటికీ ప్రోత్సాహక బహుమతి ద్వారా మరింత ఉత్సాహంతో కార్మికులు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే దిశగా పనిచేస్తారని ఎందుకు ఆలోచించడం లేదో తెలియవలసి ఉంది. లాభాల వాటను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఆలస్యం చేస్తే అది సింగరేణి కంపెనీకి నష్టమని చెప్పక తప్పదు. సింగరేణి సంస్థలో గడచిన కొన్ని సంవత్సరాలుగా సమ్మె లేని ఉత్పత్తి ఉత్పాదకత వార్షిక లక్ష్యాల సాధన అలవోకగా సాధిస్తూ వస్తుంది.
ఈ క్రమంలో ఏదైనా సమస్య తలెత్తి సమ్మె రూపం దాలిస్తే ఆ సమస్యను పరిష్కరించడం తలకు మించిన భారమే అవుతుందని తెలుస్తోంది.
ఇలాంటి సమస్యలు ఉత్పన్నం దాల్చకముందే సింగరేణి యాజమాన్యం, సింగరేణి వాట పై చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Latest