మంచిర్యాల, మహా : క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా సమీకృత కార్యాలయ భవనంలో బ్రౌస్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో టి.బి. వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, ప్రోగ్రాం అధికారి సుధాకర్ నాయక్ లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో టి. బి. వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రధానమంత్రి టి. బి. ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు.
టి. బి. వ్యాధిగ్రస్తుల సంక్షేమంలో భాగంగా బ్రౌస్ స్వచ్ఛంద సంస్థ వారు 350 పోషకాహార కిట్లను అందించడం అభినందనీయమని స్పష్టం చేశారు. ఈ కిట్ల ద్వారా మందులతో పాటు పోషక ఆహారం, వ్యాధి నిరోధక శక్తి పెరుగుదల, వ్యాధి నుండి కోలుకోవడం జరుగుతుందని, వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా వినియోగించాలని వివరించారు.
వ్యాధిగ్రస్తులు 3 నెలలకు ఒకసారి వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని, మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని తెలిపారు. జిల్లాలో 797 పాజిటివ్ కేసులు ఉన్నాయని, వ్యాధిగ్రస్తుల వివరాలను నిక్షయ మిత్ర పోర్టల్ లో నమోదు చేయాలని, తద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం 10 మంది వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. మిగతా కిట్లను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వ్యాధిగ్రస్తులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రౌస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వెంకట శ్రీధర్, సంస్థ ప్రతినిధులు, టి. బి. సమన్వయకర్త సురేందర్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






