ఆదిలాబాద్ మహా: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కలెక్టరేట్లోని పై అంతస్తు కూలిపోయిన నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు అధికార యంత్రాంగం తదుపరి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే కలెక్టరేట్లోని పలు విభాగాలను ఇతర కార్యాలయాల్లో తరలించాలని కలెక్టర్ ఆదేశించడంతో.. అదనపు కలెక్టర్ కార్యాలయాన్ని పెన్ గంగ భవన్ కు మార్చారు. సోమవారం జిల్లాకలెక్టర్ రాజర్షి షా పూజలు చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అదనపు కలెక్టర్ ను సత్కరించారు. ప్రజలు, అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు కార్యాలయాలను మార్చడం జరిగిందన్నారు. అదనపు కలెక్టర్, రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఏ, బీ,సీ, డీ, ఈ, ఎఫ్ సెక్షన్లు ఇలా 8 విభాగాల కార్యాలయాలు పెన్ గంగ భవనంలోని మార్చడం పూర్తయిందని, ఇకపై ఇక్కడి నుండే కార్యకలాపాలు జరుగుతాయన్నారు. కలెక్టరేట్లో తన చంబర్ తో పాటు డీపీఆర్డీఓ, ట్రెజరీ కార్యాలయాలకు ఎలాంటి ముప్పు లేదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వాటిని అక్కడే కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలదేవి,రాజేశ్వర్, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్ర, ఆర్డీవో స్రవంతి , తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.






