తెలంగాణ ఆడపడుచులకు
బతుకమ్మ పండుగ అంటేనే ఓ సంబురం.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సగటు తెలంగాణ ఆడపడుచులకు ఇంతకంటే పెద్ద పండగ ఏదీ లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను దేవతగా కొలిచే అరుదైన పండుగ. తీరొక్క పూలను తెచ్చి.. తంగిడి పువ్వు, గునుగు పువ్వు లతో అందంగా పేర్చి.. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆటపాటలతో ఉల్లాసంగా ప్రకృతిని, పూలను పూజించే గొప్ప పండుగ ఇది. బతుకమ్మ పండుగలో చివరి రోజు సద్దుల బతుకమ్మగా కీర్తిస్తూ మహిళలు సంతోషంగా ఆడి, పాడే పండుగ ఇది. అయితే సద్దుల బతుకమ్మ పండుగ తేదీ పై కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ స్థానిక పూజారులు, ప్రజా ప్రతినిధుల సూచనలతో సోమవారం రోజునే జరపాలని నిర్ణయించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా వరంగల్ దేశాయిపేట లోని చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద పెద్ద ఎత్తున మహిళలు చేరుకొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.
మెట్ల బావి శ్రీ ధన మైసమ్మ దేవి ఆలయం వద్ద అధ్యక్షులు తోట బాబన్న ఆధ్వర్యంలో మహిళలు పాల్గొని బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. తోట సంధ్య అలంకరించిన పెద్ద బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. 27వ డివిజన్ లోని శ్రీ గోవిందరాజుల గుట్ట ఆవరణలో స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ సీనియర్ నాయకులు చింతాకుల సునీల్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వరంగల్ హనుమకొండ జిల్లా ల్లోని
అన్ని గ్రామాల్లో పొద్దు పోయాక తీరొక పూలతో మహిళలు ఒకచోట గుమ్మికూడి బతుకమ్మ పాటలతో సందడి చేసి నీటివనరుల్లో బతుకమ్మను నిమజ్జనం చేశారు. తల్లి సల్లంగా చూడు అంటూ ఏడాదికి మళ్లీ రమ్మని గౌరమ్మను సాగనంపారు. మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతం 19, 20, 27, 34, 35 డివిజన్ లలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరు, వాడ ఒక్కటై బతుకమ్మ పాటలు పాడుతూ గౌరమ్మ చల్లంగ చూడంటూ వేడుకున్నారు. కాగా వరంగల్ హనుమకొండ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ ను మంగళవారం నిర్వహించు కుంటామని స్థానిక ప్రజలు తెలుపడం గమనార్హం.
పటిష్ట పోలీసు బందోబస్తు
సద్దుల బతుకమ్మ సందర్భంగా వరంగల్ సబ్ డివిజన్ ఏఎస్పి శుభమ్ ప్రకాష్ నేతృత్వంలో దేశాయిపేట వడ్డెపల్లి చెరువు, శ్రీ భద్రకాళి ఆలయం, శ్రీ గోవిందరాజుల గుట్ట, శివనగర్, ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు బతుకమ్మ ఆడే ప్రాంతాల్లోకి పురుషులు లోపలి రాకుండా తగు చర్యలు తీసుకున్నారు.








