మందమర్రి, మహా : నిరాశ జనకంగా సెప్టెంబర్ మాసం బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఉందని మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం జిఎం సమావేశ మందిరంలో సెప్టెంబర్ మాసం బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మాసంలో ఎక్కువ వర్షాలు కురవడంతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించలేకపోయామని అన్నారు. ఏరియా ఉత్పత్తి లక్ష్యం 204500 టన్నులు కాగా 115137 టన్నులు సాధించి 89363 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడంలో వెనుక పడ్డామని వెల్లడించారు. కేవలం ఏరియాలో కే.కే-5 గని మాత్రమే 101 శాతం బొగ్గు ఉత్పత్తి చేసి ముందు వరసలో నిలిచిందని చెప్పారు. కే.కే.ఓ.సి, ఓ.బి. 5.80 తీయవలసి ఉండగా కేవలం 0.48 మాత్రమే తీయడం వల్ల, అలాగే అకాల వర్షాల వల్ల పనులు చేయలేకపోయారని ఆయన తెలిపారు. ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పిల్లలకు విద్య, వైద్యం, ఆరోగ్యం విషయాలలో సింగరేణి సంస్థ కోట్లాది రూపాలు ఖర్చు చేస్తుందని వివరించారు. ప్రస్తుతం మందమర్రి ఏరియా నష్టాల బాటలో ఉందని చెప్పారు. ఈ నష్టాలను అధిగమించాలంటే ఏరియాలో కార్మికులు గైర్హాజరు కాకుండా రోజువారీగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం కంపెనీ సాధించిన లాభాలలో 34 శాతం వాటా 819 కోట్ల రూపాయలను కార్మికుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా దీపావళి లాభాల బోనస్ ప్రతి కార్మికునికి సగటున లక్ష 3 వేల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా దసరా పండగ అడ్వాన్స్ కింద 25 వేల రూపాయలు కూడా అందజేసినట్లు తెలిపారు. ఈనెల సగటున ప్రతీ కార్మికునికి మూడు లక్షల రూపాయల వరకు పండుగ సందర్భంగా అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో కార్మిక కుటుంబాలు దసరా పండగ సంబరాలు జరుపుకోవాలని ఆయన సూచించారు.
ప్రస్తుతం సింగరేణి సంస్థ బొగ్గు మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుందని అన్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఖర్చు టన్నుకు 3500 రూపాయలు ఖర్చవుతుండగా అమ్మకం ద్వారా కేవలం 3900 వస్తుందని అన్నారు. కోల్ ఇండియా తో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీలు 2 వేల రూపాయలకే టన్ను అమ్ముతున్నారని తెలిపారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని కార్మికులు ఎనిమిది గంటలలో ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసేలా చొరవ చూపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు.






