మంచిర్యాల, మహా : ప్రిసైడింగ్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని
మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, శిక్షణ నోడల్ అధికారి శంకర్ లతో కలిసి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడినందున ఎన్నికల కార్యచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని వివరించారు. నామినేషన్ ప్రక్రియ నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. పోలింగ్ రోజున ఓటర్ల గుర్తింపు పరిశీలన, బ్యాలెట్ పేపర్ జారీ, వేలుపై సిరాచుక్క, ప్రిసైడింగ్ అధికారి డైరీ, బ్యాలెట్ అకౌంట్ నిర్వహణ, చాలెంజ్, టెండర్ ఓట్ల జారీ విధులను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






