ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దళితుల భూస్వాధీన ప్రయత్నం , ప్రాణహాని, బెదిరింపులు కేసులో నిందితుడు ఉష్కం రఘుపతి ని అరెస్టు చేసినట్టు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.మంగళవారం తన కార్యాలయంలో మీడియా కు వివరాలు వెల్లడించారు.ఆరు సంవత్సరాల క్రితం బాధితులు గంగన్న, ఎరే లక్ష్మి తమ అసైన్డ్ పట్టా భూములను రఘుపతి వద్ద తాకట్టు పెట్టి అప్పుతీసుకున్నారు. 2025 జూన్ 5న తమ భూములను తిరిగి సాగు చేసుకోవడానికి, అప్పు తీర్చడానికి వచ్చారు.అయితే నిందితుడు కొంత మందితో కలిసి అక్కడికి చేరుకొని వారిని ప్రాణహానికి గురి చేస్తూ, ట్రాక్టర్ తో తొక్కిస్తానని బెదిరించి, భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.నిందితుడు రఘుపతిపై ఇప్పటికే మావల పీఎస్ లో రౌడీషీటు తో పాటు పలు కేసులలో నిందితుడుగా ఉన్నట్లు తెలిపారు.ఆదిలాబాద్ లో ఎలాంటి ఫోర్జరీలకు, భూ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడిన , ప్రైవేటు భూములను ఆక్రమించే ప్రయత్నం చేసినా వారి పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయడం, చట్టం-శాంతి భద్రతను కాపాడడం కోసం పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మావల సీఐ కర్ర స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








