Mahaa Daily Exclusive

  సజ్జనార్‌ ఆన్‌ డ్యూటీ నగర నూతన సీపీగా బాధ్యతలు =డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం..!

Share

హైదరాబాద్, మహా: హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తేల్చి చెప్పారు. నగర నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‌ అని, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డ్రగ్స్‌ అని చెప్పారు. దీనిపై ఉక్కుపాదం మోపుతామని, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. నగరంలో సైబర్‌ నేరాలు అరికట్టేందుకు అనేక చర్యలు చేపట్టామని, కేటుగాళ్లు ఎక్కువగా వృద్ధులను టార్గెట్‌ చేసి మోసం చేస్తున్నారని అన్నారు. సైబర్‌ నేరాలపై అవగాహన, అప్రమత్తత లేక అనేక మంది నష్టపోతున్నారని, వీటిపై నగర ప్రజలంతా అవగాహన పెంచుకోవాలి.. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో వచ్చే కాల్స్‌పై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఆన్‌లైన్‌ మోసాలపై ప్రత్యేక నిఘా
ఆన్‌లైన్‌ మోసాలు చేసేవారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, కల్తీ ఆహరంపై ప్రతేక దృష్టి పెడతాం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని సజ్జనార్ తెలిపారు. మార్కెట్ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏర్పాటు చేసి కల్తీ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందని, ఏటా లక్షల్లో కొత్త వాహనాలు వస్తున్నాయన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలు తగ్గించేందుకు కృషి చేస్తామని,ట్రాఫిక్‌ వల్ల సమయం వృథా మాత్రమే కాదు.. ఆరోగ్యమూ పాడవుతుందన్నారు. ఇక చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళల జోలికి వస్తే సీరియస్‌గా తీసుకుంటామని సజ్జనార్‌ హెచ్చరించారు.

Latest