- ఒక్క చాన్స్ ఇవ్వండి..
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా
- =అభ్యర్థుల జాబితాలో నా పేరు ఉన్నది.. ఎన్నికల యుద్ధానికి రెడీ
- =బీజేపీ నాయకురాలు మాధవీలత కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నాయకురాలు మాధవీలత తాజాగా ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం అవకాశం ఇస్తే ఎన్నికల యుద్ధానికి తాను సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనల వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారపి వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అధిష్ఠానం పరిశీలిస్తున్న అభ్యర్థుల జాబితాలో తన పేరు కూడా ఉందని తెలిసిందన్నారు. పార్టీ నాకు అవకాశం కల్పిస్తే జూబ్లీహిల్స్‌లో తప్పకుండా పోటీ చేస్తానని అంటూ ధీమా వ్యక్తం చేశారు.
సీల్డ్ కవర్‌లో అభ్యర్థుల పేర్లు..
ఇప్పటికే బీజేపీ నాయకులు పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ తన నివేదికను రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు అందజేసింది. ఈ త్రిసభ్య కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ త్రిసభ్య కమిటీ తాజాగా తన నివేదికను సీల్డ్ కవర్‍లో స్టేట్ చీఫ్‍కు అందజేసింది. అయితే సీల్డ్ కవర్‌లో అభ్యర్థులుగా జూటురు కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డిలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
========================








