- స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాకతో సందడి.
- సామాజిక మాధ్యమాలే వేదికగా పార్టీ శ్రేణుల పోటాపోటీగా పోస్టులు.
- హద్దులు దాటితే చర్యలుంటాయని హెచ్చరిస్తున్న అధికారులు.
హైదరాబాద్, మహా: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆశావహులు, పార్టీ శ్రేణులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని పోటాపోటీగా పోస్టులు చేస్తున్నారు. వీటినే అస్త్రాలుగా చేసుకుని మాటల యుద్ధం చేసుకుంటున్నారు. మంచి ఆలోచనలనూ పంచుకుంటున్నారు. ప్రతి ఇంటా స్మార్ట్‌ఫోన్ ఉండటంతో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా, ఎక్స్, యూట్యూబ్ తదితర సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలను వినియోగిస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులు గ్రామ, మండల గ్రూపుల్లో మీ ముందుకు సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులుగా వస్తున్నానని వీడియోలు, ఫొటోల ద్వారా సందేశాలు పంపుతున్నారు.
ఎన్నికల సమయాల్లో సామాజిక మాధ్యమాల్లో సంయమనం పాటించాలి. లేదంటే కేసులు ఎదుర్కోక తప్పదని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. అభ్యంతరకర పోస్టులు పెడితే ఇబ్బందుల్లో పడతారని, యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.
వారి ఖాతాలపై ప్రత్యేక నిఘా :
ఆశావహులు, నాయకులు, కార్యకర్తల సామాజిక మాధ్యమాల ఖాతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అభ్యంతరకరమైన పోస్టులు, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టేలా వాయిస్ మెసేజ్‌లు, ఫొటోల మార్ఫింగ్‌కు అవకాశం ఉండటంతో వాటిపై దృష్టి సారించారు. హద్దులు దాటితే చర్యలుంటాయని, అడ్మిన్‌దే బాధ్యత అని స్పష్టం చేస్తున్నారు.
కొన్ని ఉదాహరణలు :
రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ మండలానికి చెందిన ఒక వ్యక్తి మండల పరిధిలో ఒక తండాకు సర్పంచిగా ఏకగ్రీవం చేస్తే గ్రామ అభివృద్ధికి 25 లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధికి ఇస్తానని వాట్సప్ గ్రూపులలో పోస్ట్ పెట్టారు
ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలానికి చెందిన ఒక వ్యక్తి తనను సర్పంచిగా ఏకగ్రీవం చేస్తే పంచాయతీ ఖాతాలో రూ.50 లక్షలు డిపాజిట్ చేస్తానని గ్రామ వాట్సప్ గ్రూపులో పోస్టు పెట్టారు.
వనపర్తి జిల్లాలో ఓ మండల గ్రూపులో ఒకరు ఓ పార్టీ రాష్ట్ర నేతకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. మరో వ్యక్తి అభ్యంతరం తెలిపారు.
చివరకు ఇద్దరి మధ్య వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. గ్రూపు అడ్మిన్ అప్రమత్తమై ఇలాంటివి వ్యక్తిగతంగా పంచుకోవాలని స్పష్టం చేయడంతో చర్చ ఆపేశారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ఓ గ్రామ గ్రూపులో అభ్యర్థిగా మీ ముందుకొస్తున్నానని పోస్టు పెట్టారు. అదే పార్టీలోని మరోవర్గం ఆయనకు సహకరించమని గ్రూపులో స్పష్టం చేశారు.
దీంతో రెండు వర్గాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో పలు గ్రూపుల్లో ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయొద్దు, ఆర్థికంగా నష్టపోవద్దంటూ ప్రచారం చేస్తున్నారు.
గద్వాల జడ్పీడీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఓ నేత అనుచరులు పోస్టులు పెట్టారు..
హద్దులు మీరితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులు, ఐటీ చట్టం, బీఎన్ఎస్ కింద కేసులు కడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు.







