Mahaa Daily Exclusive

  16న తెలంగాణ కేబినెట్ స‌మావేశం..! ఇరిగేషన్ ప్రాజెక్టులు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ..

Share

  •  ఇరిగేషన్ ప్రాజెక్టులు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ
  • ఎన్నికల నిర్వహణపై సందిగ్ధ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత

హైదరాబాద్, మహా: ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. కేబినెట్ భేటీలో ఇరిగేష‌న్ ప్రాజెక్టు, బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశంపై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై సంధిగ్దం ఏర్ప‌డిన నేప‌థ్యంలో ఈ కేబినెట్ భేటీకి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు గత అర్థరాత్రి ఆర్డర్ కాపీ విడుదల చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న హైకోర్టు.. 50 శాతానికి రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. 42 శాతంలో బీసీలకు 25 శాతం రిజర్వేషన్ కేటాయించి.. మిగతా 17 శాతాన్ని జనరల్ కేటగిరీకి ఇవ్వాలని సూచించింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.

 

రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం..

హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏంటన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందన్నవార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరపనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు తీర్పుపై కూడా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ కాపీపై ఎన్నికల సంఘం న్యాయనిపుణులతో చర్చిస్తోంది. న్యాయం నిపుణుల సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకోనుంది ఎస్ఈసీ.

Latest