Mahaa Daily Exclusive

  మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ: అగ్రనేత పాపారావుతో పాటు 17 మంది లొంగుబాటుకు సిద్ధం

Share

మావోయిస్టు అగ్రనేత పాపారావు లొంగుబాటు!
* బీజాపూర్ ఎస్పీ ఎదుట సరెండర్ కానున్న మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు.
* ఆయనతో పాటే మరో 17 మంది మావోయిస్టుల లొంగుబాటుకు రంగం సిద్ధం.
* ఛత్తీస్‌గఢ్ పోలీసుల రికార్డుల్లో 50కి పైగా కేసులు.
* భద్రతా బలగాల ముమ్మర కూంబింగ్‌తో ఎట్టకేలకు తుపాకీ వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయం.

బీజాపూర్,మహా.

దండకారణ్యంలో దశాబ్దాల పాటు తుపాకీతో సహవాసం చేస్తూ, భద్రతా బలగాలకు సింహస్వప్నంగా మారిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత పాపారావు లొంగుబాటుకు రంగం సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఎస్పీ ఎదుట ఆయన అధికారికంగా లొంగిపోనున్నారు. పాపారావుతో పాటు ఆయన దళానికి చెందిన సుమారు 17 మంది ఇతర మావోయిస్టులు కూడా పోలీసుల ఎదుట సరెండర్ కానున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. దండకారణ్యంలో గత కొద్ది నెలలుగా భద్రతా బలగాలు, యాంటీ నక్సల్ ఫోర్స్‌లు అణువణువూ జల్లెడ పడుతూ భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. పోలీసుల ఉక్కుపాదం, చుట్టుముడుతున్న బలగాల వ్యూహాల నుంచి తప్పించుకోలేక పాపారావు ఎట్టకేలకు జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత ఈ లొంగుబాటు ప్రక్రియ అధికారికంగా పూర్తి కానుంది.
మావోయిస్టు పార్టీ పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్‌గా, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ) కీలక సభ్యుడిగా ఉన్న పాపారావు అరెస్టు లేదా ఏరివేత కోసం పోలీసులు సుదీర్ఘకాలంగా శ్రమిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన నేతగా గుర్తింపు ఉన్న ఈయన తలపై ప్రభుత్వం ఏకంగా రూ.2 కోట్ల భారీ రివార్డును సైతం ప్రకటించింది. బస్తర్ ప్రాంతానికే చెందిన పాపారావు మావోయిస్టు పార్టీలో ఇంద్రన్న అనే పేరుతో సుపరిచితుడు. అలాగే సున్నం చంద్రయ్య, మంగు అనే పలు మారుపేర్లతో ఆయన అనేక సాయుధ ఉద్యమాల్లో, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ముఖ్యంగా దక్షిణ బస్తర్, ఇంద్రావతి నదీ పరీవాహక ప్రాంతాల్లో మావోయిస్టులు చేపట్టిన అత్యంత విధ్వంసకర కార్యకలాపాల్లో పాపారావు వ్యూహకర్తగా వ్యవహరించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఇప్పటికే 50కి పైగా తీవ్రమైన కేసులు నమోదై ఉన్నాయి. అటువంటి అగ్రనేత తన అనుచరగణంతో కలిసి లొంగిపోతుండటం ఛత్తీస్‌గఢ్ నక్సల్స్ ఆపరేషన్ల చరిత్రలో అతిపెద్ద విజయంగా, మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

Latest