- నేటి అవసరాలకు తగ్గట్లు విద్యలో మార్పులు రావాలి
- నైపుణ్యాలకు పెద్ద పీట వేయాలి
- అప్పుడే యువత తమ కాళ్లపై తాము నిలబడగల్లుతుంది
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- భారతీయల విలువలకు ప్రాధాన్యమివ్వాలని పిలుపు
హైదరాబాద్, మహా : ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. నైపుణ్యాలకు పెద్ద పీట వేసేలా పాఠ్యప్రణాళికలను రూపొందించుకోవాలని చెప్పారు. శనివారం బేగంపేట్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ బాలికల కళాశాల 45వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘‘రోజురోజుకూ సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోంది. దీనికి తగ్గట్లు పాఠ్యప్రణాళికలు ఉండాలి. బీటెక్ చదివిన చాలా మంది ఉద్యోగ అవకాశాల కోసం కష్టపడుతున్నారు. ఆధునిక అవసరాలకు, ప్రస్తుతం వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించాలి. యువత చదువు పూర్తికాగానే తమ కాళ్లపై తాము నిలబడగలిగే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేలా విద్య ఉండాలి’’ అని స్పష్టం చేశారు. విద్య అంటే కేవలం పుస్తక పరిజ్ఞానం మాత్రమే కాదని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే గొప్ప సాధనంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్య అనేది సాధికారిత తేవాలని చెప్పారు. భారతీయ విలువలు, సంప్రదాయాలను విద్యలో భాగం చేయాలన్నారు. పిల్లలకు చిన్ననాటి నుంచే కుటుంబ విలువలు నేర్పించాలని సూచించారు. ప్రకృతిని పరిరక్షించాలని, అప్పుడే అది మనల్ని రక్షిస్తుందని చెప్పారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఇంటిలో వండిన తాజా ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. మిలెట్లు అనారోగ్యకారకాలపై బులెట్ల వంటివని, వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని చెప్పారు.
శరవేగంగా పరివర్తన చెందుతున్న భారతదేశ ప్రగతి గాథకు యువ మహిళలే రూప శిల్పులని, నూతన భారత నిర్మాణంలో వారు కీలక పాత్ర పోషించాలని శ్రీ వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు., “మీరు కేవలం ఎదుగుతున్న దేశంలోకి కాదు, ప్రపంచ వేదికపై తన స్వరూపాన్ని పునర్నిర్మించుకుంటున్న దేశంలోకి అడుగుపెడుతున్నారు. ఈ చారిత్రక తరుణంలో దేశ పురోగతిలో మీ పాత్ర అత్యంత కీలకం,” అని అన్నారు. నేడు అమ్మాయిలు, అబ్బాయిలకన్నా బాగా రాణిస్తున్నారని, ఇది సంతోషించతగిన విషయమని అన్నారు.
“మన దేశం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. స్టార్టప్‌ల నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, డిజిటల్ విప్లవం నుంచి హరిత శక్తి వరకు అన్ని రంగాల్లో నూతన శకాన్ని చూస్తున్నాం. 2027 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం,” అని చెప్పారు.
దేశ సమగ్రత, భద్రత విషయంలో నూతన భారత్ దృఢ సంకల్పంతో ఉందని, ఆర్టికల్ 370 రద్దు, ఆపరేషన్ సిందూర్ వంటివి దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థినులు కేవలం డిగ్రీలతో సంతృప్తి పడకుండా, విమర్శనాత్మకంగా ఆలోచించే నైపుణ్యాలను, సృజనాత్మకతను, సానుభూతిని పెంపొందించుకోవాలని సూచించారు. “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మానవ విలువలే మనల్ని యంత్రాల నుంచి వేరుగా నిలుపుతాయి,” అని ఆయన అన్నారు.
భారతదేశ గొప్ప వైవిధ్యాన్ని గర్వంగా భావించాలని అన్నారు. సమగ్రత, సమ్మిళితత్వం, సుస్థిరతలను ప్రోత్సహిస్తూ, సమాజానికి తిరిగి సేవ చేయాలని కోరారు. శాంతియుత మార్గమే ప్రగతికి సోపానమని, ఈ విషయాన్ని యువతరం గుర్తుంచుకోవాలని చెప్పారు. అందరితో కలిసిమెలిసి ఉండడాన్ని జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. భారతీయులుగా గర్వించాలని, ఈ గడ్డపై ప్రతిభకు కొరత లేదని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చదువుల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థినులకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథి ఐపీఎస్ అధికారిణి దీపాలి మాసిర్కర్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.





