Mahaa Daily Exclusive

  తెలంగాణ ఐకానిక్‌గా టీస్క్వేర్‌..!

Share

  • తెలంగాణ ఐకానిక్‌గా టీస్క్వేర్‌
  • వచ్చే నెలాఖరు నాటికి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి
  • యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలు సైతం వ్యాపారం నిర్వహించేలా ఉండాలి
  • రాయదుర్గం ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా టీ-స్క్వేర్ నిర్మాణం జరగాలి
  • వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రపంచ స్థాయి డిజిటల్ డిస్‌ప్లే ఉండాలి
  • ఏఐ హబ్, టీ-స్క్వేర్ నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్, మహా: హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలకు కేంద్రమైన రాయదుర్గం ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా టీ-స్క్వేర్ నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా అన్ని హంగులతో ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా ఉండాలని, నవంబర్ నెలాఖరు నాటికి ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీసీలో మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఏఐ హబ్, టీ-స్క్వేర్ నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ రెండు ప్రాజెక్టులపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అదికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోనే ఒక ఐకానిక్ భవనంలా ఉండాలని, అందుకు అనుగుణంగా నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. టీ-స్క్వేర్ ఒక కేంద్రబిందువులా పర్యాటకులను ఆకర్షించడం, రెస్టారెంట్లు, వ్యాపార నిర్వహణ, కార్పొరేట్‌ వ్యవహారాల వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని డిజైన్ రూపొందించాలని చెప్పారు.

ఆ ప్రాంతం 24 గంటలూ సందర్శకులను ఆకట్టుకునేలా ఆ ప్రదేశాన్ని తీర్చిదిద్దాలి అని సూచించారు. పెద్ద ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలు, రంగురంగుల డిజిటల్ ప్రకటనల ద్వారా ప్రపంచ స్థాయి డిజిటల్ డిస్‌ప్లేతో రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. ‘యాపిల్ లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం అక్కడ వ్యాపారం నిర్వహించేలా ఉండాలి. పార్కింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాహనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు ఉండాలి. వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు, వాణిజ్య కార్యకలాపాలతో పాటు కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా టీ-స్క్వేర్ రూపుదిద్దుకోవాలి.. అని చెప్పారు. హైదరాబాద్‌లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఏఐ ప్రాజెక్టులు, స్టార్టప్‌లు, ఇతర సెంటర్లను ఒకేచోట ఉండే విధంగా ప్రపంచ ఏఐ కంపెనీలు, పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ హబ్‌లతో భాగస్వామ్యం చేసే విధంగా ఈ హబ్ ఉపయోగపడాలని స్పష్టం చేశారు.

Latest