Mahaa Daily Exclusive

  హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖకు పదేళ్ల సమయం చాలు:మంత్రి నారా లోకేష్

Share

  • ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం
  • 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా విశాఖను అభివృద్ధి చేస్తాం
  • ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం
  • హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖకు పదేళ్ల సమయం చాలు
  • విశాఖకు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి
  • డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ప్రారంభం కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం, మహా : ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్టణాన్ని తీర్చిదిద్దుతామని, 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన అనంతరం రిషికొండలోని ఏ1 గ్రాండ్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. నిజాయతీగా చెప్పాలంటే.. 1990 లో పలు ఐటీ సంస్థలు హైదరాబాద్ కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైబర్ టవర్స్ ను నిర్మించారు. దీనివల్ల అనేక సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయి. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పైనే పట్టింది. విశాఖకు పదేళ్లకు మించి పట్టదు. అది మా కమిట్ మెంట్. కంపెనీలు తీసుకురావడం వెనుక ఉన్న శ్రమను ప్రజలు గుర్తించాలన్నారు. రాజు గారిని మొదటిసారిగా 2017లో కాలిఫోర్నియాలో కలిశాను. ఆ సమయంలోనే మొదలైంది ఈ ప్రయాణం. ఆయనను విశాఖ, ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు నాకు 8 ఏళ్ల సమయం పట్టింది. పెట్టుబడుల కోసం ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతోనే కాదు.. ఇతర దేశాలతో పోటీపడుతున్నాం. ఈ కష్టాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారన్నారు.

ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం

ఈ పెట్టుబడులు ఒక్కరోజులో రాలేదని, మంతెన రామరాజు, ఎన్ఆర్ఐ టీడీపీ నేత సాగర్ దొడ్డపనేని, కాటంనేని భాస్కర్ ఈ ప్రాజెక్ట్ ను విశాఖపట్నానికి తీసుకురావడంలో ఎంతో కీలకపాత్ర పోషించారన్నారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఎంతో మంది కృషి ఉందని, గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఏపీకి ఆర్థిక రాజధాని, ఇది మా అజెండా. ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానమని పేర్కొన్నారు. విశాఖపై నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉందని, 2019లో రాష్ట్రంలో, ఇతర ప్రాంతాల్లో మేం ఓడిపోయినా విశాఖ ప్రజలు మాత్రం మాతోనే ఉన్నారన్నారు విశాఖ ప్రజలు ధైర్యవంతులు 2014 సమయంలో హుద్ హుద్ విపత్తు వచ్చినప్పుడు నగరం తీవ్రంగా నష్టపోయింది. అప్పుడు విశాఖ ప్రజలు నగర పునరుద్ధరణకు చంద్రబాబుకు ఎంతో మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ కూడా నష్టాన్ని స్వయంగా చూశారు. ఇంత విధ్వంసం తర్వాత కూడా ప్రజలు చిరునవ్వుతో చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. అది విశాఖ ప్రజల స్ఫూర్తి అని ప్రశంసించారని పేర్కొన్నారు.

దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి

గత 17 నెలల్లో ఏపీకి వచ్చిన 120 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 50 శాతం కంటే ఎక్కువగా గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కు వచ్చాయని లోకేష్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖకు వస్తోందని, దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖపట్నానికే వస్తోంది. దీనివల్ల శక్తివంతమైన ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. సూపర్ సిక్స్ హామీల్లో చెప్పినట్లుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. టీసీఎస్ కు 99 పైసలకే భూమి కేటాయించారని కొంతమంది విమర్శించారని, కోర్టుకు కూడా వెళ్లారన్నారు. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఆ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. ఆ నిర్ణయం వల్ల కాగ్నిజెంట్, యాక్సెంచర్, సత్వా, గూగుల్ వంటి సంస్థలు విశాఖకు వచ్చాయి. ఒక విధాన నిర్ణయం ఎన్నో మార్పులకు కారణమైంది. విశాఖకు ఇది ఎంతో కీలక సమయం. ఇది కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే కాదు.. డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ రైలులా దూసుకెళ్తోందన్నారు. ఏపీ ఆర్థిక అజెండాకు ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారని, కేంద్రం చేపట్టే ఆర్థిక సంస్కరణల్లో ఏపీకి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. విశాఖలో 3 లక్షల మంది యోగాంధ్ర నిర్వహించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ సృష్టించామని ఇది చూసి ప్రధాని ఆశ్చర్యపోయారన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నాం

ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలిగామని, కేంద్రం స్టీల్ ప్లాంట్ కు రూ.11వేల కోట్ల సాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు అందించిందని, మూడు ఫర్నేస్ లు ఇప్పుడు పనిచేస్తున్నాయన్నారు. వంద శాతం సామర్థ్యంతో నడిపి ప్లాంట్ ను లాభదాయకంగా మారేలా చేస్తామని, నిధులు అడగాల్సిన అవసరం రాకూడదన్నారు. ఇదే మా లక్ష్యం. రూ.14వేల కోట్ల సాయం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించడమే కాదు.. అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు. ఇది కేవలం ఏపీ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు.. భారత్ ఆర్థిక వ్యవస్థకూ దోహదం చేస్తుందన్నారు. రైల్వే జోన్ సాధించాం, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నాం. ఇప్పుడు టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ఐటీ కంపెనీలు వస్తున్నాయి. వచ్చే మూడు నెలల్లో విశాఖకు మరిన్ని పెట్టుబడులు వస్తాయి. ఏ ఒక్క పెట్టుబడి పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది తొలి అడుగు మాత్రమే. మొత్తం ఎకో సిస్టమ్ రావాల్సిన అవరసం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో సిఫీ ఛైర్మన్ రాజు వేగేశ్న, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షా రామ్, రాజేష్ తిరుమల రాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యే పెన్మత్మ విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఐటీ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, ఇతర ఉన్నతాధికారులు ఎన్.యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Latest