Mahaa Daily Exclusive

  ఫైరింగ్ చేస్తారా?లాఠీచార్జి చేస్తారో చూద్దాం:కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Share

  • ఫైరింగ్ చేస్తారా?లాఠీచార్జి చేస్తారో చూద్దాం
  • రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారు?
  • పంచెలు కట్టుకొని వచ్చి మరీ ఆలయం తలుపులు తెరుస్తాం
  • రెండ్రోజుల టైం ఇస్తున్న ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఏం చేయాలో అది చేస్తాం
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

వేములవాడ, మహా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రభుత్వం అనేక డెవలప్‌మెంట్ పనులను చేపట్టింది. ఈ క్రమంలో ముఖ్యంగా గర్భగుడి పరిసర ప్రాంతంలో ప్రస్తుతం పనులను చేపట్టింది. దీనిలో భాగంగా ఆలయాన్ని కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అదే విధంగా పూజలు, అభిషేకాలు, ఇతర అన్ని రకాల కైంకర్యాలు మాత్రం యథావిధిగా జరుగుతాయన్నారు. భక్తులు మాత్రం కోడె మొక్కులు, చండీ యాగం, ఇతర అన్ని రకాల పూజలు భీమేశ్వర ఆలయం వద్ద నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. అధికారులు చేసిన ప్రకటన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమన్న ఆలయంలో రాజన్న మొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు చేయడంపై బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆలయం మూసివేసే పంచెలు కట్టుకుని వచ్చి మరీ ఆలయం తలుపులు తెరుస్తామన్నారు. ఫైరింగ్ చేస్తారో లాఠీచార్జి చేస్తారో చూద్దామని చెప్పారు. ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని ఆలోపు ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామన్నారు.

ఇది పేరు ప్రతిష్టల కోసం జరుగుతోంది..
బీజేపీ కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి మేం భక్తులకు అండగా నిలుస్తామన్నారు. కోడె మొక్కులు అంటేనే రాజన్నకు చెల్లిస్తామని బండి సంజయ్ అన్నారు. ఆలయాల మూసివేత కావాలనే చేస్తున్నారని మనమంతా అలర్ట్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమ్మతి లేకుండా ఆలయం మూసివేస్తే అందరం కలిసి రోడ్డెక్కాల్సిందేనన్నారు. ప్రజల సెంటిమెంట్‍ను విస్మరిస్తే సహించేది లేదన్నారు. కొందరు ఏడాది పాటు ఆలయం మూసివేస్తారని చెబుతుంటే మరికొందరు ఆర్నెళ్లు మూసివేస్తారని చెబుతున్నారని మండిపడ్డారు. ఆలయ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం. కానీ ఇది పేరు ప్రతిష్టల కోసం జరుగుతోందని ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి కొడె మొక్కలు రాజన్న ఆలయంలో చెల్లించుకొవడం సంప్రదాయమన్నారు. ఆలయం డెవలప్ మెంట్‌కు తాము అడ్డుకొవట్లేదని, కానీ అనాలోచిత ఇష్టమున్నట్లు తీసుకుంటున్న ప్రభుత్వం నిర్ణయంకు మాత్రం వ్యతిరేకమన్నారు.