- పారదర్శకంగా డీసీసీల నియామకం
- అన్ని వర్గాలకు తప్పకుండా అవకాశం కల్పిస్తాం
- ప్రతి ఒక్కరి అభిప్రాయంతోనే అధ్యక్షుని ఎంపిక ఉంటుంది
- ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రౌతేలా వెల్లడి
మెదక్, మహా: ప్రతి ఒక్కరి అభిప్రాయంతోనే అధ్యక్షుని నియామకం ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రౌతేలా తెలిపారు. మెదక్ జిల్లాలో ఆదివారం డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి రౌతేలా మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో ఏఐసీసీ సూచన మేరకు బీసీసీ అధ్యక్షులు నియామకం కోసం ప్రత్యేక అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. నియమించిన కమిటీ ఆయా మండల, బ్లాక్, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గాలు బ్లాక్ స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి అభిప్రాయ శాఖను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డీసీసీల నియామకంలో పారదర్శకంగా పార్టీ కోసం పని చేసే వారికి అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఇందులో ముఖ్యంగా బ్లాక్ స్థాయిలో నేతల అభిప్రాయంతో పాటు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఎవరైతే బాగుంటారు అనే అభిప్రాయాన్ని కార్యకర్తల వద్ద నుంచి తీసుకున్నట్లు వివరించారు.
ఎవరి ప్రమేయం ఉండదు..
అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత వారికి సంబంధించిన పేర్లను పీసీసీకి అందజేస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల డీసీసీ కోసం అభిప్రాయం సేకరించిన వారి పేర్లను పీసీసీకి అందిస్తే వారు ఏఐసీసికి పంపిస్తారని, అక్కడ అధ్యక్షుడి నియామకం ప్రకటిస్తుందని చెప్పారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదని, నేతల అభిప్రాయాలు ప్రధానంగా తీసుకుంటామని వెల్లడించారు. ఒక వర్గానికి కాకుండా అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పదవి ఆశిస్తున్న వారి వివరాలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎఐసిసి అభిప్రాయ సేకరణతోనే అధ్యక్షులు నియామకం చేపడుతుందని, ఇదంతా పారదర్శకంగా ఉంటుందని వివరించారు. ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా అందరూ అభిప్రాయంతోనే బీసీసీలను నియామకం చేయడం వల్ల పార్టీ మరింత బలోపితమయ్యే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే అధిష్టానం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.







