- మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
- 1980లో జర్నలిస్ట్‌గా మొదలైన ఆయన ప్రస్థానం
- జర్నలిజంపై మక్కువతో ఎన్ఎస్ఎస్ స్థాపన
- రాజకీయాలతో పాటు జర్నలిజంలోనూ రాణించిన నేత
హైదరాబాద్, మహా : తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా పేరొందిన కొండా లక్ష్మారెడ్డి ఇకలేరు. సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వయోభారం కారణంగా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స అందుకుంటూనే సోమవారం కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యేగా అందరికీ తెలిసిన ఆయన న్యూస్ అండ్ సర్వీస్ సిండికేట్ (ఎన్ఎస్ఎస్) మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా విశేష సేవలందించారు.
జర్నలిజంపైన ఉన్న మక్కువతో 1980లో స్థానిక వార్తా పత్రిక ఎన్ఎస్ఎస్ ను స్థాపించారు. జర్నలిస్ట్ హక్కుల కోసం ఎంతో కృషి చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తో ముడిపడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో పాటు ఏపీ క్రీడా మండలి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. అదే విధంగా మరిన్ని పదవుల్లో కూడా ఆయన సేవలందించారు.
సీఎం రేవంత్ సంతాపం..
కొండా లక్ష్మారెడ్డి మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎన్ఎస్ఎస్ వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, ఎమ్మెల్యేగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ ప్రెసిడెంట్‌గా ఆయన అందించిన సేవలను అద్భుతమన్నారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యలకు ఆయన తన సానుభూతి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు.







