Mahaa Daily Exclusive

  విద్యార్థుల ఆహార నాణ్యతకు స్పెషల్ యాప్:ఉన్నతాధికారులతో సీఎం రేవంత్

Share

బడుల్లో విద్యార్థుల ఆహార నాణ్యతకు స్పెషల్ యాప్
వారికి ల‌భించే కేల‌రీల‌ను తెలుసుకోవాలి
రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
విద్యార్థుల‌కు నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోండి
హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించడం, వైద్యులు స్టూడెంట్స్‌కు అందుబాటులో ఉండాలి
ప్రతినెలా గ్రీన్ ఛానల్‌లో నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించండి
వివిధ సంక్షేమ శాఖల సమీక్షలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ ఆదేశాలు

హైదరాబాద్, మహా: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వ‌స‌తి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ. 60 కోట్లు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునే వెసులుబాటు క‌లిగించింది. హాస్టళ్లకు కేటాయించిన నిధుల చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ముఖ గుర్తింపుకు ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయి డేటా, జవాబుదారీతనం ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు యాప్‌ను ఉప‌యోగించాలని, విద్యార్థుల‌కు సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దాంతో వారికి ల‌భించే కేల‌రీల‌ను తెలుసుకోవాలని సూచించారు.

‘హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో స‌క్ర‌మంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలి. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వ‌స‌తులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్ చేయాలి. హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలి. హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలి. అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలి..” అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు స్కాలర్‌షిప్‌లు, సిబ్బంది జీతాలు, డైట్ ఛార్జీలు, నిర్మాణ ఖర్చులు, ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపుకు అవసరమైన మొత్తానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌లను ఆదేశించారు.

హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 24 గంటలూ ఆన్‌లైన్‌లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్‌లైన్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎడ్ టెక్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్ర‌చారాన్ని అడ్డుకోవాల‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. వీటన్నింటికీ అవసరమైన యాప్‌లను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షకు ముందు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ హాస్టళ్లలోని పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సమీక్ష‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest