Mahaa Daily Exclusive

  ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్ చేయండి – సిట్ కోరిన సమాచారం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశం, అరెస్టు నుంచి రక్షణ పొడిగింపు

Share

  • సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
  • ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయండి
  • సిట్ అడిగిన సమాచారం ఇవ్వాల్సిందేనన్న కోర్టు
  • ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొడిగింపు
  • తదుపరి విచారణ నవంబర్ 18కు వాయిదా

న్యూఢిల్లీ, మహా : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీం ఆదేశించింది. అలాగే ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొడిగించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినించారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు అప్పగించాలని కోర్టును కోరారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయన్నారు. డిజిటల్ డివైసెస్‌లో డాటా ఫార్మా చేశారని ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్క్ ల్లో డేటా ధ్వంసం చేసినట్లు న్యాయవాదులు తెలియజేశారు. కొత్తగా 50 హార్డ్ డిస్కులు అక్కడ పెట్టారన్నారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్ లు టాప్ చేశారని సుప్రీంలో వాదనలు వినిపించారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేసినట్లు తెలిపారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ తమకు ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించారు.

ప్రభాకర్ రావు తరఫున న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయనను 11సార్లు పిలిపించి 80 గంటల పాటు విచారణ జరిపినట్లు తెలిపారు. డేటాను ప్రభాకర్ రావు డిలీట్ చేయలేదని డిపార్ట్మెంట్ డిలీట్ చేసిందని చెప్పారు. ప్రభాకర్ రావు డిపార్ట్‌మెంట్‌లో ఒకరు కాదని, ఆయన్ను పెడతానని ముఖ్యమంత్రి బాహటంగా బెదిరించారంటూ అంటూ లాయర్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలి ఆదేశిస్తూ ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణను పొడిగించింది. ఈకేసు తదుపరి విచారణను నవంబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.

Latest