- ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు
- జేడీయూకు కనీసం 25 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు
- నీతీశ్ కుమార్ మళ్లీ సీఎం కాలేరు: ప్రశాంత్ కిశోర్ హాట్ కామెంట్స్
బిహార్, మహా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వ్యక్తిగతంగా పోటీకి దూరమయ్యారు. ఈ మేరకు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తానని.. తాను మాత్రం పోటీ చేయనని పీకే తెలిపారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది. దానికి నేను కట్టుబడి ఉన్నాను. రాఘోపుర్‌లో తేజస్వీ యాదవ్‌పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించాం. పార్టీ ప్రయోజనాల మేరకే నేను పోటీకి దూరంగా ఉంటున్నా. ఒకవేళ నేను పోటీలో ఉంటే.. పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి నా దృష్టి మళ్లే అవకాశం ఉంది’ అని ప్రశాంత్ కిశోర్ వివరించారు.
కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య విభేదాలు..
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ దాదాపు 150 సీట్లలో విజయం సాధిస్తుందని పీకే విశ్వాసం వ్యక్తంచేశారు. అప్పుడు తమ పార్టీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు. ఒక వేళ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జన సురాజ్ పార్టీ ఏ కూటమికి మద్దతిస్తుందన్న ప్రశ్నకు.. పీకే బదులిస్తూ ‘అది అసాధ్యం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు. ‘వచ్చే ఎన్నికల్లో జేడీయూకు కనీసం 25 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు ఓటమి తప్పదు. నీతీశ్ కుమార్ మళ్లీ సీఎం కాలేరు. అటు ఇండియా కూటమి పరిస్థితి కూడా అంతగా మెరుగ్గా లేదు. కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి’ అని పీకే ఆరోపించారు







