వరంగల్, మహా: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హన్మకొండలోని పీజీఆర్ గార్డెన్‌లో బుధవారం జరిగిన ఎమ్మెల్యే తల్లి కాంతమ్మ దశదిన కర్మకు ఆయన హాజరయ్యారు. దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మరణించగా, బుధవారం దశదిన కర్మ నేపథ్యంలో సీఎం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. కాంతమ్మకు నివాళులు అర్పించి దొంతిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి, రేవంత్ రెడ్డి పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొద్ది నిమిషాలు అక్కడే గడిపి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి కేయూ రోడ్డులోని పీజేఆర్ గార్డెన్ కు చేరుకుని కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, నర్సంపేట నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు, ఈలలతో హోరెత్తించారు. అందరినీ ఉత్సాహపరుస్తూ అభివాదం చేస్తూ రేవంత్ ముందుకు సాగారు. ఈ సందర్భంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు







