- అజ్ఞాతం వీడి జన జీవనంలోకి
- మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావో అగ్ర నేత మల్లోజుల
- 54 ఆయుధాలతో సహా సరెండర్ అయిన 61 మంది మావోయిస్టులు
- గడ్చిరోలి జిల్లాలో సభ.. ఆయ వ్యక్తులపై ఉన్న రివార్డులు అందజేసిన ఫడ్నవీస్
మహారాష్ట్ర, మహా: మావోయిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీలో దశాబ్ధాలుగా పని చేస్తూ, కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి లొంగిపోయారు. బుధవారం గడ్చిరోలి జిల్లాలో మరో 61 మంది కార్యకర్తలతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది. లొంగిపోయిన నక్సల్స్ 54 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇందులో ఏడు ఏకే -47, తొమ్మిది ఇన్సాస్ రైఫిల్స్ ఉన్నాయి. భూపతి అలియాస్ సోనూ మావోయిస్టు సంస్థలో అత్యంత ప్రభావవంతమైన వ్యూహకర్తలలో ఒకరిగా పరిగణించబడ్డారు. మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ప్లాటూన్ కార్యకలాపాలను సుదీర్ఘంగా పర్యవేక్షించాడు. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు. పార్టీలో అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు. మావోయిస్టు పార్టీలో దాదాపు రెండో స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవటం ఆ పార్టీ అతిపెద్ద ఎదురుదెబ్బ అని పోలీసులు భావిస్తున్నారు. వరుస ఎన్ కౌంటర్లలో కీలక నేతలు చనిపోవటంతో పాటు వరుసగా లొంగుబాటులు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతోందన్న ప్రచారం తీవ్రస్థాయికి చేరుతోంది.
అత్యంత కీలక నేతగా…
మల్లోజుల వేణుగోపాల్ 1981లో తాను ఎంచుకున్న సిద్దాంతం కోసం అడవి బాట పట్టారు. మొదటగా ఏటూరు నాగారం దళం సభ్యుడిగా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1982లో మహదేవపూర్ పోలీసులు మల్లోజులను అరెస్టు చేయగా, 1983లో విడుదల కావడంతో తిరిగి దళంలోకి వెళ్లారు. 1993లో డీకేఎస్ఆర్సీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో పొలిట్ బ్యూరో మెంబర్ గా పదోన్నతి లభించింది. పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ కీలకంగా మారారు. ఇక గత కొన్నిరోజుల కిందటే మల్లోజుల మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆయుధాలను వదులుకుని ప్రధాన స్రవంతిలో కలవాలని, తమను తాము రక్షించుకోవాలని, అర్థరహిత త్యాగాలు చేయవద్దని కార్యకర్తలకు ఆయన ఒక లేఖలో పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇకపై సాయుధ పోరాటాన్ని కొనసాగించలేనని సోను తన సహచరులకు లేఖలో చెప్పారు.







