Mahaa Daily Exclusive

  తెలంగాణ ఆల్ టైం రికార్డు..రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: మంత్రి ఉత్తమ్

Share

  • తెలంగాణ ఆల్ టైం రికార్డు
  • 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం
  • 29 రాష్ట్రాల్లో ఇంతటి ధ్యానం దిగుబడి ఏనాడు రాలేదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: మంత్రి ఉత్తమ్
  • వానాకాలం ధాన్యం కొనుగోళ్ల‌పై మంత్రులు ఉత్తమ్, తుమ్మల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, మహా: ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్ టైం రికార్డు సృష్టించిందని, దేశంలోని 29 రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంతటి దిగుబడి ఏనాడు రాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం వానాకాలం ధాన్యం కొనుగోళ్ల‌పై సచివాలయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సునిషితమైన అంశమని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎక్కడ అసౌకర్యం కలుగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో వ్యవసాయ చరిత్రలోనే రికార్డు నమోదు చేసుకోవడమే కాకుండా.. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం సరికొత్త రికార్డు అవుతుందని అన్నారు. రూ.23 వేల కోట్లను వెచ్చించి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. అందులో 40 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు, 40 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకాలు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో 4,259 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 3,517 ఐకేపీ కేంద్రాల ద్వారా ఇతర సంస్థల ద్వారా మరో 566 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు రవాణా వసతి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్‌ను అందిస్తామని స్పష్టం చేశారు.ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, నల్గొండ జిల్లాలో 1,205 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 నుంచి 72 గంటల వ్యవధిలో రైతులకు నగదు చెల్లింపులకు వీలుగా తూకం నుంచి డేటా ఎంట్రీ వరకు సమయపాలన పాటించాలన్నారు. వర్షం వస్తే ధాన్యం చెడిపోకుండా ఉండేందుకు గాను టార్పాలిన్లను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తితే 1800-425-00333/1967 హెల్ప్‌లైన్ నెంబర్లు రైతులు ఫోన్ చేయాలన్నారు. గడిచిన రెండేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేశామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రస్తుత వానాకాలంలో ముందెన్నడూ లేని రీతిలో ధాన్యం దిగుబడి వచ్చిన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ, సహకార శాఖలు సమన్వయం చేసుకొని క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేక దృష్టితో సారించాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు