Mahaa Daily Exclusive

  తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ: స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేత, హైకోర్టులో కేసు కొనసాగించవచ్చని తీర్పు

Share

  • 42 శాతం బీసీ రిజర్వేషన్లు
  • తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
  • స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
  • హైకోర్టులో కేసు కొనసాగించవచ్చన్న న్యాయస్థానం

న్యూఢిల్లీ, మహా : బీసీలకు 42 శాతం రిజర్వషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్మయాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన జీవో నంబర్ 9 పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ప్రస్తుతం పాత పద్దతిలోనే ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున అవసరమైతే 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో నంబర్ 9ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోపై కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా, రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించి ఉన్నాయని అలాగే సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘ట్రిపుల్ టెస్ట్’ (వెనుకబాటుతనం, జనాభా వివరాలు, 50 శాతం పరిమితి) ప్రమాణాలను పాటించలేదనే కారణంతో హైకోర్టు దీనిపై స్టే విధించింది. హైకోర్టు స్టే కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.

హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ జీవో నంబర్ 9 ఆధారంగా స్థానిక ఎన్నికలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్ పీ) దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ గురువారం వాదనలు వినిపించారు. ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. రిజర్వేషన్లు 50శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదని కోర్టుకు వివరించారు. ఇందిరా సహానీ కేసులోనూ 50 శాతం పరమితి దాటొచ్చని ఉందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని అభిషేక్ సింఘ్వీ న్యాయస్థానానికి వివరించారు. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని.. 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని వాదించారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పిందని.. సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని వాదనలు బలంగా వినిపించారు. వాదనలను విన్న జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పునరుద్ఘాటిస్తూ 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Latest