హైదరాబాద్, మహా : ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీ అంశంపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందంటూ మాగంటి సునీత, కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బీఆర్ఎస్ తరఫున న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. నియోజకవర్గంతో సంబంధం లేని వారికి ఓట్లు ఉన్నాయని 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఒకే ఇంట్లో 43 మంది ఓటర్లు నమోదు అయ్యారని, బోగస్ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించినా చర్యలు తీసుకోవడం లేదని వాదించారు. ఈసీ తరపున లాయర్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టులో బిహార్ ఎలక్షన్లపై విచారణ నడుస్తోందని, నామినేషన్ల చివరి తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ రిప్రజెంటేషన్లపై ఎన్నికల అధికారికి ఆదేశించామని, నివేదకను బట్టి చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 8 వేలు అయితే బీఆర్ఎస్ 12 వేలు అని చెబుతుందని, 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని వాదన వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఇప్పటికే ఎలక్టోరల్స్ ని ఈసీ రివిజన్ చేస్తోందని ఈ సమయంలో ఎలాంటి డైరెక్షన్ అవసరం లేదని పేర్కొంటూ విచారణను ముగించింది.







