- విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్
- 2026 జూన్ నుంచి అమలుకు సర్కార్ శ్రీకారం
- ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలి
- నర్సరీ – 4 వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి
- విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
హైదరాబాద్, మహా: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులు, మంచి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంపై దృష్టి సారించాలని తెలిపారు.
సంస్కరణలన్నీ 2026 జూన్ నెలలో
విద్యా శాఖ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి, సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు విద్యను అందించే నూతన పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సీఎం అన్నారు. ఈ పైలట్ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులను కల్పించి విద్యను అందించే ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం), లంచ్ (మధ్యాహ్న భోజనం) అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మార్పులు, సంస్కరణలన్నీ 2026 జూన్ నెలలో ప్రారంభమయ్యే అకడమిక్ ఇయర్ (విద్యా సంవత్సరం) నుంచి అమలు జరిగేలా సమగ్రమైన యాక్షన్ ప్లాన్‌తో ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు







