- డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
- మత్తు పదార్థాల వ్యసనాన్ని పూర్తిగా అరికట్టాలి
- ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
హైదరాబాద్, మహా: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. తెలంగాణలో మత్తు పదార్థాల వ్యసనాన్ని పూర్తిగా అరికట్టాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం ఉంటేనే ఈ లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనపై పోరులో పోలీసు, ఆరోగ్యశాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ మేరకు ఇరు డిపార్ట్‌మెంట్ల ఉన్నతాధికారులతో మంత్రి శుక్రవారం సెక్రటేరియట్‌లో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడం కేవలం ప్రభుత్వంతో సాధ్యం కాదని, సమాజంలోని అన్ని వర్గాలనూ ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు, టీచర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలు తీసుకుంటున్న వారిలో వచ్చే బిహేవియరల్ ఛేంజెస్ గురించిన అవగాహన ప్రతి పేరెంట్‌కు, టీచర్‌కు ఉండాలన్నారు.
ఈ విషయంలో విస్తృత ప్రచారం జరగాలని మంత్రి సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లలో రెగ్యులర్‌గా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తల ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు. సమావేశంలో టీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హెల్త్ సెక్రటరీ, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, టీఏఎన్‌బీ ఎస్పీ రూపేశ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సూపరింటెండెంట్, డాక్టర్ అనిత, న్యాయ శాఖ అడిషనల్ సెక్రటరీ సునీత తదితరులు పాల్గొన్నారు







